Russian Ukraine Crisis: చైనీయులు ఉక్రెయిన్ విడిచి వెళ్లే.. పరిస్థితుల్లేవనీ, కాస్త సంయమనంతో వ్యవహరించాలని ఉక్రెయిన్‌లోని చైనా రాయబార కార్యాలయం సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులను తరలించడం సురక్షితం కాదని రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ అన్నారు.
Russian Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రను కొనసాగిస్తుంది. నాల్గో రోజు కూడా ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు.. రష్యా దళాలు ఉక్రెయిన్ నగరాలపై విరుచుకపడుతున్నాయి. ఆ దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ.. దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలను రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. రాజధాని నగరం కీవ్ సిటీని ఆక్రమించుకునేందుకు రష్యా బలగాలు దూసుకెళ్తుంటే.. ఎదురుదాడి తీవ్రం చేసింది ఉక్రెయిన్.
ఈ క్రమంలో ఉక్రెయిన్ సైనికులు కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. అవసరమైతే.. సైనికుల తమ దేశ రక్షణ కోసం ఆత్మహుతి దాడులకు కూడా వెనుకాడటం లేదు. ఇలా గత నాలుగు రోజులుగా సైనిక దాడులు, బాంబుల మోతల మధ్య ఉక్రెయిన్ పౌరులు వణికిపోతున్నారు. ఏ క్షణంగా ఏం జరుగుతుందోనని భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎక్కడ ఆశ్రయం దొరికితే.. అక్కడ తలదాచుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రాణాలు అరచేత పట్టుకుని.. 1,50,000 మంది ప్రజలు పొరుగు దేశాలకు పారిపోవాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఉక్రెయిన్ లో ఉంటున్నా.. తమ పౌరులను సురక్షితంగా తరలించడానికి ఆయా దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం సంబంధిత అధికారులతో చర్చించి.. దాదాపు 400పైగా విద్యార్థులను స్వదేశానికి సురక్షితంగా రప్పించింది. ఉక్రెయిన్ సరిహద్దు దాటి.. ఇతర దేశాలకు వచ్చిన వారిని తరలిస్తామని భారత్ ప్రకటించింది.
అయితే.. చైనా మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తుంది. చైనీయులు ఉక్రెయిన్ విడిచి వెళ్లే.. పరిస్థితుల్లేవనీ, కాస్త సంయమనంతో వ్యవహరించాలని ఉక్రెయిన్‌లోని చైనా రాయబార కార్యాలయం సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులను తరలించడం సురక్షితం కాదని రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ అన్నారు. రష్యా దండయాత్ర తర్వాత ప్రజలు స్వదేశానికి రప్పిస్తామనీ, ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ పేర్కొన్నారు.
తాను ఉక్రెయిన్ రాజధాని కివీని విడిచి ఎక్కడికీ వెళ్లలేదని, కివీలోనే ఉన్నానన్నారు. ఈ విషయంలో లేని పోని పుకార్లు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ పుకార్లను తొలగించడానికి దౌత్య కార్యాలయం యొక్క అధికారిక WeChat ఖాతా ద్వారా సుదీర్ఘమైన వీడియో సందేశాన్ని పంపారు. ఆ వీడియో సందేశం ద్వారా.. దేశంలో చిక్కుకుపోయిన చైనా జాతీయులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
చైనీయులను అతి సురక్షితంగా స్వదేశానికి చేర్చడమే తమ ముందున్న లక్ష్యమని, రష్యా దాడి ముగిసేంత వరకూ సమనయంతో వేచిచూడాల్సిందేని అన్నారు. అందరూ సురక్షితంగా ఉండేవిధంగా.. సౌకర్యాలు అందరికీ అందేలా సౌకర్యాలు చేశామని, పౌరులెవ్వరూ భయపడొద్దని భరోసా కల్పించారు.
గత కొన్ని రోజులుగా.. అందరిలాగే.. తాము కూడా నిరంతరం సైరన్లు, పేలుళ్లు, తుపాకీ శబ్దాలు వింటున్నామనీ, తాము కూడా పదేపదే బేస్‌మెంట్లలో దాక్కున్నామని.. ఇలాంటి దృశ్యాలు ఇంతకుముందు సినిమాల్లో మాత్రమే చూశామనీ, ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్లు రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ పేర్కొన్నారు. భద్రతా పరిస్థితులు మెరుగు అయ్యేంత వరకు ధైర్యంగా ఉండాలని అన్నారు.
ఉక్రేనియన్ల నుండి చైనీస్ పౌరుల పట్ల శత్రుత్వం పెరుగుతున్నట్లు సోషల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లోని స్థానికులతో ఎవ్వరూ వాదాలకు గానీ, గొడవలకు గానీ దిగొద్దని ఉక్రెయిన్‌లోని చైనా రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ సూచించారు. ఉక్రెయిన్ ప్రజలు చాలా కష్టమైన స్థితిలో ఉన్నారు. చాలా బాధపడుతున్నారనీ, వారి భావాలను అర్థం చేసుకోవాలి, వారిని రెచ్చగొట్టకూడదని సూచించారు. ప్రస్తుతం వారు సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారని, చాలా ఇబ్బందులు పడుతున్నారని చైనా రాయబారి ఫ్యాన్ జియోన్రాంగ్ అన్నారు. ఉక్రెయిన్‌లో ఉద్యోగం, చదువు కోసం దాదాపు 6,000 మంది చైనీయులు ఉన్నారని చైనా పేర్కొంది.
కొన్ని వారాల ముందు, యుకె, యుఎస్, జపాన్‌తో సహా పలు దేశాలు దౌత్యవేత్తలను ఖాళీ చేయించి, యుద్ధ భయాలు పెరగడంతో పౌరులను విడిచిపెట్టమని కోరాయి. ఉద్రికత్తలు పెరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ పౌర విమానాల సేవలపై ఆంక్షాలు విధించింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌లో రష్యా చర్యలను ఖండిస్తూ శుక్రవారం UN భద్రతా మండలి తీర్మానానికి చైనా దూరంగా ఉంది.
