గతంలో తనను అపహాస్యం చేసిన ట్రంప్‌కు స్వీడిష్‌కు చెందిన ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త గ్రెటా థన్‌బె‌ర్గ్ సోషల్‌మీడియాలో గట్టి కౌంటర్‌ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఓటమి ఖాయంగా తెలుస్తున్న తరుణంలో పదిహేడేళ్ల గ్రెటా చిల్, డోనాల్డ్, చిల్ అంటూ ట్వీట్ చేసింది. అయితే దీనికోసం ఇలా ప్రతీకారం తీర్చుకోవడానిక గ్రెటా 11 నెలలు  వేచి చూడాల్సి వచ్చింది.  

తాజా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎదురవుతున్న నిరాశపై ఆమె సెటైర్లు వేశారు. ఓడిపోవడాన్ని అంగీకరించలేక "స్టాప్ ది కౌంట్!" అంటూ కుళ్లుకుంటున్న ట్రంప్‌ను ఆమె ట్రోల్‌ చేశారు.  ట్రంప్ ప్రవర్తన చాల హాస్యాస్పదంగా ఉంది. యాంగర్ మేనేజెమెంట్ మీద దృష్టి పెడితే మంచిది. దీనికోసం స్నేహితులతో కలిసి ఏదైనా మంచి పాత ఫ్యాషన్‌ సినిమాకు వెళ్లండి! చిల్, డొనాల్డ్, చిల్!" అంటూ థన్‌బర్గ్ గురువారం ట్వీట్ చేశారు. 

దీంతో ఇప్పటికే సోషల్‌ మీడియాలో ట్రంప్‌ను భారీగా ట్రోల్‌ చేస్తున్ననెటిజన్లకు గ్రెటా ట్వీట్‌ మరింత ఊపునిచ్చింది.  దీంతో వ్యంగ్య కామెంట్లతో హల్‌ చల్‌  చేస్తున్నారు. లక్షల కొద్దీ 'లైక్'లు, వేలాది రీట్వీట్లతో సందడి చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్న గ్రేటా థన్‌బర్గ్‌ను 2019లో టైమ్ మ్యాగజైన్  ఇయర్‌ ఆఫ్‌ ది పర్సన్ పేరుతో సత్కరించింది. ఈ సందర్బంగా చిల్‌ గ్రెటా అంటూ ట్రంప్ గ్రెటాను ఎగతాళి చేశారు. "చాలా హాస్యాస్పదం గ్రెటా తన యాంగర్ మేనేజ్‌మెంట్‌పై పని చేయాలి, ఆపై స్నేహితుడితో మంచి పాత ఫ్యాషన్ చిత్రానికి వెళ్లండి!! " అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో మనసునొచ్చుకున్న గ్రెటా మంచి సమయం కోసం వేచి చూసి గట్టి కౌంటర్‌ ఇచ్చింది.