ఇజ్రాయెల్ పై హమాస్ దాడి.. టర్కీ, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్ లో ప్రజల సంబరాలు.. వీడియోలు వైరల్
ఇజ్రాయిల్ పై పాలస్తీనా మిలిటెంట్ల గ్రూప్ హమాస్ దాడిని పలు దేశాలు ఖండిస్తున్నాయి. కానీ పలు దేశాల్లోని ప్రజలు మాత్రం దీనిపై సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయిల్ పై రాకెట్లతో దాడి చేస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాము కూడా యుద్ధానికి సిద్ధమే అంటూ ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రకటించింది. అయితే అంతర్జాతీయ సమాజం ఇజ్రాయిల్ కు మద్దతు గా నిలుస్తోంది. అమెరికా, భారత్ ఇజ్రాయిల్ కు అండగా ఉంటామని పేర్కొన్నాయి.
కాగా.. హమాస్ జరిపిన ఆకస్మిక దాడి వల్ల ఇజ్రాయిల్ లో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 800 వందల మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. అయితే ‘టైమ్స్ నౌ’ కథనం ప్రకారం.. ఈ దుశ్చర్యపై ప్రంపచంలోని పలు దేశాలు మండిపడుతుంటే.. మరికొన్ని దేశాలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడి, ప్రాణనష్టం పట్ల పలుదేశాల్లోనే ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.
ఇజ్రాయిలపై హమాస్ దాడి నేపథ్యంలో టర్కీ, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్ వంటి దేశాల్లో వేడుకలు జరిగాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీశారు. పలు ప్రాంతాల్లో డీజేలు, పెట్టి పటాసులు పేల్చారు. పాలస్తీనాకు మద్దతుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోల్లో ఎంత వరకు వాస్తవముందనేది స్పష్టంగా తెలియరాలేదు.