భారత్‌పై కెనడా ఆరోపణలు తీవ్రమైనవి.. దర్యాప్తు జరగాల్సిందే: స్వరం మారుస్తున్న అమెరికా..!
ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదంపై అమెరికా క్రమంగా కెనడాకు అనుకూలంగా స్వరం మార్చుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఖలిస్తానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్-కెనడాల మధ్య దౌత్యవివాదం కొనసాగుతుంది. అయితే ఈ వివాదంపై అమెరికా క్రమంగా కెనడాకు అనుకూలంగా స్వరం మార్చుతున్నట్టుగా కనిపిస్తోంది. కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని.. దర్యాప్తు సక్రమంగా జరిగి నిందితులను న్యాయవ్యవస్థ ముందుకు తీసుకురావడమే ముఖ్యమని.. ఇరుదేశాలు తమకు మిత్రులేనని.. ఇరు దేశాల వాదనలు వింటున్నామని అమెరికా గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే భారత్, కెనడాలను మిత్రదేశాలుగా పేర్కొన్న అమెరికా.. ఇప్పుడు కెనడా దర్యాప్తుకు భారత్ సహకరించాల్సిందేనని చెబుతోంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయంపై కెనడా ఆరోపణలు తీవ్రమైనవని పేర్కొన్న అమెరికా.. దీనిపై పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ మేరకు వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ల సమన్వయకర్త జాన్ కిర్బీ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శకంర్, వైట్‌హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ గత వారం అమెరికాలో సమావేశమైనప్పుడు కెనడా చేసిన వాదనలు చర్చించబడ్డాయని జాన్ కిర్బీ చెప్పారు. అయితే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడేందుకు.. దానిని తాము కచ్చితంగా ఆ రెండు దేశాలకు వదిలివేస్తామని తెలిపారు.
‘‘మేము స్పష్టంగా ఉన్నాము. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. వాటిపై పూర్తిగా దర్యాప్తు చేయబడాలి. వాస్తవానికి, మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా.. ఆ దర్యాప్తులో చురుకుగా పాల్గొనాలని మేము భారతదేశాన్ని కోరుతున్నాము’’ అని జాన్ కిర్బీ చెప్పారు.
అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ వేదాంత్ పటేల్ కూడా ఇదే విధమైన కామెంట్స్ చేశారు. ఓ విలేకరుల సమావేశంలో వేదాంత్ పటేల్ మాట్లాడుతూ.. కెనడా దర్యాప్తు ముందుకు సాగడం, నేరస్థులను న్యాయం చేయడం చాలా క్లిష్టమైనదని అన్నారు. మేము గతంలో బహిరంగంగా, ప్రైవేట్‌గా చెప్పినట్లుగా.. కెనడియన్ దర్యాప్తులో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు.
భారత్‌లోని కెనడియన్ హైకమిషన్ కోసం దౌత్య సిబ్బంది స్థాయిలపై నివేదికలను అమెరికా చూసిందని వేదాంత్ పటేల్ అన్నారు. కానీ ఆ నివేదికలపై ఏమి చెప్పలేనని అన్నారు. ‘‘ఇది మా ఇండో-పసిఫిక్ వ్యూహానికి సంబంధించినది. మేము ఈ ప్రాంతంపై ఉంచుతున్న దృష్టి, ఆ ప్రయత్నం, ఆ పని కొనసాగుతుంది. భారతదేశంతో మేము క్వాడ్‌లో, అనేక ఇతర వేదికల్లో భాగస్వాములుగా ఉన్నాము. మేము వారితో, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో అనేక ముఖ్యమైన సమస్యలపై పని చేస్తూనే ఉన్నాము’’ అని వేదాంత్ పటేల్ చెప్పారు.
అయితే తాను చెప్పినట్లుగా.. తాము ఈ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణిస్తామని.. తాము తమ కెనడియన్ భాగస్వాములతో సన్నిహితంగా పనిచేయడమే కాకుండా, కెనడాతో సహకరించాలని భారత ప్రభుత్వాన్ని బహిరంగంగా, ప్రైవేట్‌గా కోరుతున్నామని వేదాంత్ పటేల్ చెప్పారు.