అమెరికా వస్తువులపై కెనడా ప్రతీకార పన్నులను వడ్డిస్తోంది... ఆ దేశాక్షుడు ట్రంప్ ఎలాగైతే ప్రతీకార పన్నులు విధిస్తున్నాడో అదే స్టైల్లో కేనడా కూడా వ్యవహరిస్తుందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పారు. 

Canada: అమెరికా వస్తువులపై కెనడా ప్రతీకార పన్ను విధింపుకు సిద్దమయ్యింది. ఇకపై అమెరికా వస్తువులు తమ దేశంలో దిగుమతి చేసుకోవాలంటే భారీ పన్నులు అమల్లోకి వస్తాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కెనడా వస్తువులపై అమెరికా పన్నులు వేస్తోంది కాబట్టి తాముకూడా అలాగే వ్యవహరించాల్సి ఉంటుందని... అమె పన్నులు వేస్తుందని ఆయన అన్నారు.

"అమెరికా వాణిజ్య చర్యను ఉపసంహరించే వరకు మా పన్నులు కొనసాగుతాయి. ఒకవేళ అమెరికా పన్నులు ఆపకపోతే పన్నుయేతర చర్యలను కొనసాగించడానికి మేము రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చురుకుగా చర్చలు జరుపుతున్నాము. అమెరికా ప్రభుత్వం తమ పన్నులను పునఃపరిశీలించాలని కోరుతున్నాము. కెనడా మాత్రం మా ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, కార్మికులు, న్యాయమైన ఒప్పందం కోసం గట్టిగా నిలబడుతుంది." అని అన్నారు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  పన్నులు ఖచ్చితంగా అమల్లోకి వస్తాయని చెప్పిన తర్వాత ట్రూడో ఈ ప్రకటన చేశారు. కెనడా లేదా మెక్సికోలపై అమెరికా పన్నులు తగ్గించే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేసారు. కెనడా ఎగుమతులపై 25 శాతం, కెనడా ఇంధనంపై 10 శాతం పన్నులు విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించిందని ట్రూడో గుర్తుచేసారు. 

''30 రోజుల విరామం తర్వాత కెనడా ఎగుమతులపై 25 శాతం, కెనడా ఇంధనంపై 10 శాతం పన్నులు విధించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికా పన్నులు ఈ రాత్రికి అమల్లోకి వస్తే కెనడా రేపు ఉదయం 12:01 గంటలకు 155 బిలియన్ డాలర్ల అమెరికన్ వస్తువులపై 25 శాతం పన్నులు విధిస్తుంది. వెంటనే 30 బిలియన్ డాలర్ల వస్తువులపై పన్నులు మొదలవుతాయి. మిగిలిన 125 బిలియన్ డాలర్ల అమెరికన్ ఉత్పత్తులపై 21 రోజుల్లో పన్నులు విధిస్తాం" అని ట్రూడో హెచ్చరించారు.

అమెరికా విధించే పన్నుల వల్ల అమెరికన్లు కిరాణా, గ్యాస్, కార్లకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుందని... వేలాది ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని కెనడా ప్రధాని పేర్కొన్నారు. "పన్నులు విజయవంతమైన వాణిజ్య సంబంధాన్ని దెబ్బతీస్తాయి. అధ్యక్షుడు ట్రంప్ గతంలో చర్చించిన వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు" అని ఆయన అన్నారు.

అమెరికా సరిహద్దులో పట్టుబడిన ఫెంటానిల్‌లో 1 శాతం కంటే తక్కువ కెనడా నుండి వస్తుందని... రెండు దేశాల ప్రజలను ప్రభావితం చేసే ఈ సమస్యను పరిష్కరించడానికి కెనడా ప్రయత్నాలు చేస్తోందని ట్రూడో అన్నారు. ఫెంటానిల్ ప్రవాహాన్ని ఆపడానికి కొత్త హెలికాప్టర్లు, సిబ్బంది, ఎక్కువ వనరులతో కెనడా సరిహద్దు ప్రణాళికను అమలు చేసిందని ఆయన చెప్పారు.

ఫెంటానిల్ ప్రవాహాన్ని ఆపడానికి కెనడా చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ, ట్రూడో ఇలా అన్నారు, "అమెరికా సరిహద్దులో పట్టుబడిన ఫెంటానిల్‌లో 1 శాతం కంటే తక్కువ కెనడా నుండి వస్తున్నప్పటికీ, కెనడియన్లు, అమెరికన్లను ప్రభావితం చేసే ఈ సమస్యను పరిష్కరించడానికి మేము అవిశ్రాంతంగా పనిచేశాము. ఫెంటానిల్ ప్రవాహాన్ని ఆపడానికి కొత్త హెలికాప్టర్లు, సిబ్బంది, ఎక్కువ సమన్వయం, ఎక్కువ వనరులతో 1.3 బిలియన్ డాలర్ల సరిహద్దు ప్రణాళికను అమలు చేశాము." అని తెలిపారు.

"మేము ఫెంటానిల్ ను అక్రమరవాణా చేసే అంతర్జాతీయ నేర ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా జాబితా చేర్చాము... ఈ ముఠాల ఆట కట్టించేందుకు జాయింట్ ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ సెల్‌ను ప్రారంభించాము, వ్యవస్థీకృత నేరాలపై కెనడా-అమెరికా జాయింట్ స్ట్రైక్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఈ పని వల్ల అమెరికాకు కెనడా నుండి ఫెంటానిల్ తరలింపు డిసెంబర్ 2024, జనవరి 2025 మధ్య 97 శాతం తగ్గిపోయింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ స్వాధీనం చేసుకున్నది 0.03 పౌండ్లకు చేరుకుంది." అని ఆయన అన్నారు.

కెనడాపై పన్నులపై ట్రంప్ ఏమన్నారంటే :

ఇంతకుముందు ఫిబ్రవరిలో కెనడా, మెక్సికో నుండి దిగుమతులపై 25 శాతం పన్నులు, చైనా నుండి వచ్చే వస్తువులపై అదనంగా 10 శాతం పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత సరిహద్దు భద్రతను మెరుగుపరచడానికి రెండు దేశాల నుండి కొత్త హామీలు పొందిన తర్వాత కెనడా, మెక్సికో నుండి దిగుమతులపై పన్నులను 30 రోజుల పాటు నిలిపివేశారు. మెక్సికో, కెనడా లతో మాట్లాడిన తర్వాత ఈ విరామం పెట్టారు.

ఫిబ్రవరి 27న కెనడా, మెక్సికో సరిహద్దుల నుండి దేశంలోకి అక్రమంగా మత్తు పదార్థాలు వస్తున్నాయని ట్రంప్ విమర్శించారు. మార్చి 4 నుండి రెండు దేశాలపై పన్నులు కొనసాగించాలని, ఏప్రిల్ 2 నుండి పరస్పర పన్నులను "పూర్తి స్థాయిలో" కొనసాగించాలని నిర్ణయించారు.

"మెక్సికో, కెనడా నుండి మా దేశంలోకి చాలా ఎక్కువ స్థాయిలో మత్తు పదార్థాలు వస్తూనే ఉన్నాయి. వీటిలో చాలా వరకు చైనాలో తయారవుతున్నాయి. గత సంవత్సరం ఈ ప్రమాదకరమైన విషాల వల్ల 100,000 మందికి పైగా చనిపోయారు. గత రెండు దశాబ్దాలలో లక్షలాది మంది చనిపోయారు.బాధితుల కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి. ఈ సమస్యను అమెరికాలో కొనసాగించడానికి వీలులేదు. కాబట్టి ఇది ఆగే వరకు లేదా చాలా వరకు తగ్గే వరకు, మార్చి 4న అమలులోకి రావాల్సిన పన్నులు ఖచ్చితంగా అమలులోకి వస్తాయి." అని ట్రంప్ అన్నారు.  చైనాపై అదనంగా 10 శాతం పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.