Canada: కెనడాలో తీవ్రవాదాన్ని కీర్తించడంపై ట్రూడో పార్టీ ఎంపీ చంద్ర ఆర్యా విచారం
కెనడాలో తీవ్రవాదాన్ని కీర్తించడంపై ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సొంతపార్టీ ఎంపీ చంద్ర ఆర్యా విచారం వ్యక్తం చేశారు. కెనడాలోని మెజార్టీ సిక్కులు ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతు ఇవ్వరని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట తీవ్రవాదాన్ని, విద్వేషపూరిత నేరాలను ఎలా కీర్తిస్తారనే విషయం నాకు అర్థం కావడం లేదని వివరించారు.

ఒట్టావా: భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఘర్షణాయుత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఓ ఖలిస్తానీ సానుభూతిపరుడి హత్యపై భారత్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ చేసిన ఆరోపణలు ఉభయ దేశాలను కుదిపేశాయి. ఈ నేపథ్యంలో జస్టిన్ ట్రూడో పార్టీకే చెందిన ఎంపీ చంద్ర ఆర్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని తీవ్రవాద శక్తులు హిందూ కెనడియన్లను తిరిగి భారత్‌కు వెళ్లిపోవాలని బెదిరిస్తున్నాయని, దాడి చేస్తున్నాయని అన్నారు. అంతేకాదు, దేశంలోని హిందూ కెనడియన్లు దేశంలో ఆందోళనలు చెందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవాంఛనీయ ఘటన జరిగినా వెంటనే స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
ఎంపీ చంద్ర ఆర్యా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పార్టీ అయిన లిబరల్ పార్టీ ఆఫ్ కెనడాకు చెందినవారే కావడం గమనార్హం. ‘కొన్ని రోజుల క్రితం కెనడాలోని ఖలిస్తాన్ ఉద్యమ నేత, సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రెసిడెంట్ హిందు కెనడియన్లపై దాడి చేశారు. మమ్మల్ని కెనడా వదిలి ఇండియాకు తిరిగివెళ్లాలని బెదిరిస్తున్నారు’ అని చంద్ర ఆర్యా ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘ఈ లక్షిత టార్గెట్‌తో హిందూ కెనడియన్లు భయాందోళనలకు గురవుతున్నారు. హిందూ కెనడియన్లు మౌనంగా ఉండి, జాగరూకతతో ఉండాలని కోరుతున్నాను. హిందూఫోబియా కోణంలో ఏ అవాంఛనీయ ఘటన చోటుచేసుకున్నా వెంటనే స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను సంప్రదించాలి’ అని ఆయన పేర్కొన్నారు. వారు హిందూ కెనడియన్లను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వారు కేవలం కెనడాలోని హిందూ, సిక్కులను విభజించాలనే కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు.
కెనడాలోని మెజార్టీ సిక్కులు ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతు ఇవ్వరని ఆర్యా పేర్కొన్నారు. ‘ఈ విషయాన్ని నేను స్పష్టపరచాలనుకుంటున్నాను. కెనడియన్ సిక్కు సోదరులు, సోదరీమణుల్లో మెజార్టీ ప్రజలు ఖలిస్తానీ ఉద్యమాన్ని సమర్థించరు. చాలా మంది సిక్కులు అనేక కారణాల వల్ల బహిరంగంగా ఖలిస్తానీ ఉద్యమాన్ని ఖండించకపోవచ్చు. వారంతా హిందూ కెనడియన్లతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. సామాజిక, సాంస్కృతిక విలువలను కలిగి ఉన్నాయి’ అని వివరించారు.
ఇలా హిందూ కెనడియన్లపై ఖలిస్తానీ ఉద్యమ నేతలు నేరుగా దాడి చేయడం వల్ల ఇప్పటికే నెలకొన్న ఉభయ దేశాల మధ్య ఘర్షణాయుత వాతావరణాన్ని ఎగదోసినట్టు అవుతున్నదని ఆర్యా కామెంట్ చేశారు. ఇటీవలే హిందూ ఆలయాలపై వారి దాడి జరిగిందని, కొందరు భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను వేడుకు చేసుకున్నారని పేర్కొన్నారు.
కెనడా ఉన్నత నైతిక విలువలను కలిగిన దేశం అని, తాము చట్టబద్ద పాలనను అంగీకరిస్తామని వివరించారు. అయితే, భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట విద్వేష నేరాలను, తీవ్రవాదాన్ని శ్లాఘించడం దారుణం అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
‘భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట తీవ్రవాదాన్ని, విద్వేషపూరిత నేరాలను ఎలా కీర్తిస్తారనే విషయం నాకు అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు.
Also Read: బాలకృష్ణ ముందే మెంటల్... అసెంబ్లీ రానివ్వొద్దు..: స్పీకర్ ను కోరిన వైసిపి ఎమ్మెల్యే (వీడియో)
హిందూ కెనడియన్లు లో ప్రొఫైల్‌గా ఉంటారని, వారిని హిందూ వ్యతిరేక శక్తులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. హిందూ కెనడియన్ల విజయాలను వారు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ‘రెండు గ్రూపులు హిందూ కెనడియన్ల సముదాయాన్ని, నన్ను కూడా బెదిరించాయి. దాడి చేస్తున్నాయి. గత పది నెలలుగా హిందూ మతానికి సంబంధించిన ఓం జెండాను పార్లమెంట్ హిల్ పై ఎగరేసినందుకు నాపై దాడులు కొనసాగిస్తున్నారు’ అని ఆర్యా తెలిపారు.
‘కెనడియన్లుగా మనం హిందూ విశ్వాసాన్ని, వారసత్వం పట్ల గర్వపడుతున్నాం. కెనడా దేశ సామాజిక, ఆర్థిక పురోగతిలో మన వాటా పట్ల కూడా గర్వంగా ఉన్నాం’ అని వివరించారు.