Asianet News TeluguAsianet News Telugu

దురదృష్టం నుంచి తప్పించుకోవడానికి పుట్టిన తేదీ మార్చుకున్న ప్రధానమంత్రి

కంబోడియా ప్రధాని హున్ సేన్‌కు రెండు డేట్ ఆఫ్ బర్త్‌లు ఉన్నాయి. ఒకటి అధికారికంగా ఉన్నది.. మరోటి తన నిజమైన జన్మ దినం. రెండు జన్మదినాలు కలిగి ఉండటం మూలంగా ఆయనకు ముప్పు ఏర్పడుతుందని ఆయన భావించారు. అందుకే దురదృష్టం నుంచి తప్పించుకోవడానికి ఆయన తన నిజమైన పుట్టిన రోజునే అధికారికంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
 

cambodia pm hun sen changes date of birth to skip bad luck
Author
New Delhi, First Published May 20, 2022, 8:05 PM IST

న్యూఢిల్లీ: కంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్ తన డేట్ ఆఫ్ బర్త్‌ను మార్చుకున్నాడు. అధికారికంగా తన పుట్టిన తేదీ ఏప్రిల్ 4,1951. కానీ, ఈ తేదీని 1952 ఆగస్టు 5కు మార్చుకున్నాడు. అయితే, తాను మార్చుకున్న అంటే కొత్త తేదీ తన నిజమైన పుట్టిన తేదీ అని ప్రధానమంత్రి వెల్లడించారు.

ఈ ప్రకటన తన అన్నయ్య మే 5వ తేదీన మరణించిన తర్వాత ప్రధాని హున్ సేన్ ప్రకటించారు. ప్రధాని హున్ సేన్ అన్నయ్య అనారోగ్యం కారణంగా సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తన అన్నయ్య మరణంతో తనకూ ఏదో అపశకునం జరుగుతుందని అనుమానపడ్డట్టు తెలిసింది. ఎందుకంటే.. మరణించిన అన్నయ్యకు కూడా రెండు పుట్టిన రోజులు ఉన్నాయని, తన మరణానికి ఈ రెండు డేట్ ఆఫ్ బర్త్‌లతో సంబంధం ఉన్నదని ఆయన భావిస్తున్నారు.

కంబోడియా ప్రధాని హున్ సేన్ రెండు పుట్టిన రోజులు రెండు వేర్వేరు జన్మ రాశులను సూచిస్తున్నాయి. ఒకటేమో టైగర్ ఇయర్‌ను చూపిస్తుంటే.. తన నిజమైన పుట్టిన సంవత్సరం గోవు రాశిని సూచిస్తున్నది. కాబట్టి, ఆయన తన లీగల్ డేట్ ఆఫ్ బర్త్‌ను పక్కన పెట్టి.. తన నిజమైన పుట్టిన రోజునే లీగల్ డేట్ ఆఫ్ బర్త్‌గా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నారు. తద్వార దురదృష్టం నుంచి తప్పించుకోవచ్చని నమ్ముతున్నారు.

ఈ విషయమై తాను న్యాయశాఖ మంత్రితో చర్చించానని కంబోడియా ప్రధాని హున్ సేన్ వెల్లడించారు. తాను తన నిజమైన పుట్టిన రోజునే అధికారిక జన్మ దినంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. చైనా రాశులను నమ్మాలని ఆయన పేర్కొన్నారు.

50 ఏళ్లు పైబడిన వారికి రెండు పుట్టిన రోజులు ఉండటం కంబోడియాలో సర్వసాధారణం. ఎందుకంటే, ఖ్మేర్ రోగ్ పాలించిన 1975- 1979 కాలంలో చాలా మంది తమ పుట్టిన తేదీలను మార్చుకున్నారు. తద్వారా వారు మిలిటరీలో చేరకుండా తమను తాము కాపాడుకునేవారు.

Follow Us:
Download App:
  • android
  • ios