వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు అంటారు. రెండోదాని సంగతి ఏమిటోగానీ వాన రాకడను మనమే డిసైడ్‌ చేసే రోజులు రానున్నాయనేదానికి ఈ వాటర్‌ జనరేటర్‌ చిన్న ఉదాహరణ. 

గాలి నుంచి నీరు తయారు చేయవచ్చని అనేక సిద్ధాంతాలు చెబుతున్నాయి. అయితే వీటిని ప్రాక్టికల్ గ చేసి చూపించింది కాలిఫోర్నియాలోని ఓ కంపెనీ. అంతేకాదు ఈ వాటర్‌ జనరేటర్‌ లతో ప్రభావవంతంగా నీటిని తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాయి. 

అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌–టు–వాటర్‌ టెక్నాలజీతో గాలి నుంచి నీరు తయారు చేసే యంత్రానికి  రూపకల్పన చేసింది కాలిఫోర్నియాకు చెందిన స్కైసోర్స్, స్కై వాటర్‌ అలయెన్స్‌. 

వెడ్యు అంటే వుడ్‌–టు–ఎనర్జీ డిప్లాయబుల్‌ ఎమర్జెన్సీ వాటర్‌ అనే ఈ యంత్రం నుంచి మంచినీరు తయారు చేయడానికి పెద్ద ఖర్చు అక్కర్లేదు. సింపుల్‌గా మనకు అందుబాటులో ఉన్న ఎండుపుల్లలు, ఎండిన పండ్లతొక్కలు, ఎండిన కొబ్బరి పెంకులు, పొట్టు మొదలైనవి యంత్రంలో వేసి వేడెక్కిస్తే  నీటి ఆవిరి ద్వారా జనరేటర్‌ స్వచ్ఛమైన మంచినీటిని తయారు చేస్తుంది. 

ఈ మొబైల్‌ వాటర్‌ జనరేటర్‌ను ఎలాంటి వాతావరణంలో నైనా ఉపయోగించవచ్చు. సోలార్, బ్యాటరీ సిస్టంతో కూడా ఈ యంత్రం పని చేస్తుంది. రోజుకు రెండు వేల లీటర్ల స్వచ్ఛమైన నీటిని తయారు చేసే ఈ వాటర్‌ జనరేటర్‌ను ప్రస్తుతం శరాణార్థి శిబిరాలు, కరువు ప్రభావిత ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు.