Mexico Bus Accident: మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 27 మంది మరణించారు. అదే సమయంలో 21 మంది గాయపడ్డారు.
Mexico Bus Accident: మెక్సికోలో బుధవారం ఓ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా, మరో 21 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ మెక్సికన్ రాష్ట్రం ఓక్సాకా గుండా వెళుతున్న బస్సు లోయలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఓక్సాకా మంత్రి జీసస్ రొమెరో మాట్లాడుతూ.. ఈ ఘోర ప్రమాదంలో ఓ చిన్నారితో సహా 27 మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగింది?
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. బస్సు రాజధాని మెక్సికో సిటీ నుండి పశ్చిమ ఓక్సాకాలోని యోసెండువాకు ప్రయాణిస్తుండగా స్థానిక కాలమానం ప్రకారం సుమారు 6:30 గంటల సమయంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయి.. ఘాట్ రోడ్డు నుంచి 80 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. మాగ్డలీనా పెనాస్కో పట్టణంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంపై ఓక్సాకా రాష్ట్ర గవర్నర్ సాలోమన్ జారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మెక్సికో దేశంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.అంతకుముందు ఏప్రిల్‌లో పశ్చిమ మెక్సికోలో బస్సు కొండపై నుండి పడిపోవడంతో కనీసం 18 మంది మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు.
