బంగ్లాదేశ్ సరిహద్దులో భారత సరిహద్దు భద్రతా  దళాలు ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్లా మోమెన్ అన్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు జాగ్రత్తగా ఉండాలని మోమెన్ హెచ్చరించారు.  సరిహద్దుల్లో కాపలాగా ఉన్నప్పుడు ప్రాణాంతకం కాని ఆయుధాలను ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు.

కాగా బీఎస్ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో పౌరులు మరణించిన ప్రాంతాలను బంగ్లాదేశ్ గుర్తించిందని, ప్రమాదాలను నివారించడానికి ఆ హాట్ స్పాట్లకు మరిన్ని బలగాలను తరలించాలని తాము యోచిస్తున్నట్లు అబ్దుల్లా మీడియాకు తెలిపారు.

కాగా, అస్సాంలోని కరీమ్ గంజ్‌లో ఆదివారం బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు పౌరులను హతమార్చినట్లుగా వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. కరీమ్ ‌గంజ్ టీ ఎస్టేట్ నుంచి పశువులను దొంగిలిస్తూ ఏడుగురు బంగ్లాదేశీయులు స్థానికులకు చిక్కగా, వీరిలో ముగ్గురు మరణించారు. మరికొందరు స్వల్ప గాయాలతో పారిపోయారని అసోం పోలీసులు తెలిపారు.

బీఎస్ఎస్ జవాన్లు చట్టాన్ని ఉల్లంఘించినట్లు తేలితే వారిని అరెస్ట్ చేస్తామని మోమెన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ జవాన్లు దొరికితే తమకు అప్పగించాలని బంగ్లా పౌరులను ఆయన కోరారు.

పశువుల అక్రమ రవాణాపై బీఎస్ఎఫ్ కఠినమైన వైఖరిని అవలంభించడం సరికాదని అబ్దుల్లా సూచించారు. కరీమ్ గంజ్‌లో జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుగుతున్నప్పటికీ, బంగ్లా పౌరులకు చికిత్స అందించాల్సిందిగా బీఎస్ఎఫ్‌ను బంగ్లా అధికారులు కోరారు.