దేశంలోని బ్యాంకులకు ఇతర ఆర్ధిక సంస్థలకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వారి ఫేవరేట్ ప్లేస్‌గా బ్రిటన్ నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలోని చట్టాలు వారికి ఆ వెసులుబాటును కలిగిస్తున్నాయి. ఎస్‌బీఐ సహా కొన్ని ప్రధాన బ్యాంకులకు రూ.9 వేల కోట్లు టోకరా వేసిన  లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్‌లోనే ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తుండగా...పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.13 వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ కూడా బ్రిటన్‌లోనే ఉన్నట్లు  ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతో కొంత నిజం ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది.

వీరిద్దరిని భారత్‌కు రప్పించాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలకు బ్రిటన్ షాక్ ఇచ్చింది. నీరవ్, మాల్యాలను అప్పగించాలంటూ తమకు ఒక పనిచేసి పెట్టాలని అప్పుడే వారిని పంపిస్తామని.. భారత్‌కు ఒక షరతు పెట్టింది. అదేంటంటే.. ప్రస్తుతం యూనైటెడ్ కింగ్‌డమ్‌లో 75 వేల మందికి పైగా వలసదారులు నివసిస్తున్నారు.. వీరిలో ఎక్కువ మంది భారతీయులే.. వీరంతా ఆ దేశానికి తలనొప్పిగా మారారు.. వీరిని దేశం నుంచి పంపించడంలో సహకరించని పక్షంలో..బ్రిటన్‌లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్లను అప్పగించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రభుత్వం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. మరి దీనిపై భారత్‌ ఎలాంటి వాదన వినిపిస్తుందో వేచి చూడాలి.