క్యాన్సర్ ను తగ్గించే సరికొత్త మెడిసిన్ ... యూఎస్ శాస్త్రవేత్తల కీలక ప్రకటన
క్యాన్సర్ ను తగ్గించే మెడిసిన్ తయారీతో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేసారు. తాజాగా అమెరికన్ సైంటిస్ట్ రొమ్ము క్యాన్సర్ మెడిసిన్ పై కీలక ప్రకటన చేసారు.

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ భూతాన్ని అంతం చేసేందుకు శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు ఫలితాలను ఇస్తున్నాయి. మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్ పై చేపట్టిన ప్రయోగాల్లో ముందడుగు పడింది. ఇప్పటికే రొమ్ము క్యాన్సర్ కోసం తయారుచేసిన వ్యాక్సిన్ ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు ఇచ్చిందనే శుభవార్తలు శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు.
అమెరికాలోని ఇల్లినయాస్ యూనివర్సిటీ పరిశోధకులు ErSO-TFPy మాలిక్యూల్ ను రూపొందించారు. దీన్ని ఎలుకల్లో ప్రయోగించగా ఒకేఒక్క డోస్ తో క్యాన్సర్ ట్యూమర్స్ ను పూర్తిగా తగ్గించిందట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
''రొమ్ము క్యాన్సర్ కణితులు గల ఎలుకల్లో ఈ మాలిక్యూల్ చాలాబాగా పనిచేసింది.దీనివల్ల దీర్ఘకాలంగా రొమ్ము కేన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్నవారికి మంచి ప్రయోజనం కలుగుతుంది'' అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

