బ్రెజిల్‌ రాజకీయాల్లో కొవాగ్జిన్ కొత్త కుంపటి పెట్టింది. అధ్యక్షుడు బొల్సోనారో కుర్చీ కిందకు నీళ్లు తీసుకొస్తోంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని అక్కడి పార్లమెంట్ కమిటీ అనుమానిస్తోంది

బ్రెజిల్‌ రాజకీయాల్లో కొవాగ్జిన్ కొత్త కుంపటి పెట్టింది. అధ్యక్షుడు బొల్సోనారో కుర్చీ కిందకు నీళ్లు తీసుకొస్తోంది. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని అక్కడి పార్లమెంట్ కమిటీ అనుమానిస్తోంది. దీనిపై విచారణ చేపట్టింది. ఫైజర్, అస్ట్రాజెనెకాలను కాదని బోల్సోనారో కొవాగ్జిన్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరచారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయనకు వ్యతిరేకంగా జనం రోడ్డెక్కారు.

ఇక చాలు దిగిపో అంటూ మండిపడుతున్నారు. భారత్ బయోటెక్‌కు, బ్రెజిల్ కంపెనీకి మధ్యలో ఒక ప్రైవేట్ కంపెనీ వుంది. ఈ నేపథ్యంలో కొవాగ్జిన్ విషయంలో భారీ కుంభకోణం జరిగినట్లుగా పార్లమెంట్ కమిటీ అనుమానిస్తోంది. కరోనా నియంత్రణలో బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారో విఫలమయ్యారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో బోల్సోనారో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై పార్లమెంట్ కమిటీ విచారణ చేపట్టింది.

Also Read:ప్రైవేట్‌లో కొవాగ్జిన్ ధరలను తగ్గించలేం: తేల్చి చెప్పిన భారత్ బయోటెక్

ఫిబ్రవరి 25న భారత్ బయోటెక్, బ్రెజిల్ మధ్య ఒప్పందం జరిగింది. రెండు కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు అంగీకారం జరిగింది. డీల్ విలువ 300 మిలియన్ డాలర్లుగా తెలుస్తోంది. భారత్ బయోటెక్ నుంచి టీకాలు సేకరించింది బ్రెజిల్ కంపెనీ ప్రెసిసా మెడికా మెంటోస్. ప్రైవేట్ కంపెనీకి వంద మిలియన్ డాలర్లు ముట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ డీల్‌పై సెనేట్ కమిటీ విచారణ జరుపుతోంది.