Pope election: పోప్ ఫ్రాన్సిస్ మరణంతో కొత్త పోప్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తొలి ఓటింగ్‌లో ఫలితం రాలేదు. వాటికన్‌లో నల్ల పొగ కనిపించింది.  

Pope election: వాటికన్ నగరంలో మే 7న సిస్టైన్ చాపెల్ పై నుంచి నల్ల పొగ వచ్చింది. ఇది తొలి ఓటింగ్‌లో కొత్త పోప్ ఎన్నిక కాలేదనడానికి సంకేతం. రోమన్ కాథలిక్ చర్చ్ కొత్త పోప్ ను ఎంపిక చేసే గోప్యమైన, శతాబ్దాల నాటి సంప్రదాయ ప్రక్రియ కాన్‌క్లేవ్‌ ప్రారంభమైంది.

కొత్త పోప్ ఎంపిక ఎలా జరుగుతుంది?

పోప్ ఎన్నిక ప్రక్రియలో మొదటి రోజున ఒక్క ఓటింగ్ మాత్రమే ఉంటుంది. తరువాత రోజుల్లో రోజుకు నాలుగు ఓట్ల వరకు వేస్తారు. ఉదయం రెండు, మధ్యాహ్నం రెండు. మూడో రోజుకు కూడా ఎవరూ పోప్‌గా ఎంపిక కాలేకపోతే ఓటింగ్‌ను ఒక రోజు పాటు నిలిపివేసి ప్రార్థనలు జరుపుతారు. 21 ఓట్ల తరువాత కూడా నిర్ణయం తీసుకోలేకపోతే పోప్ అభ్యర్థులను ఇద్దరికి పరిమితం చేస్తారు. అయితే గత 100 ఏళ్లలోగా అన్ని కాన్‌క్లేవ్‌లు మూడు రోజుల్లోపు ముగిశాయి. 

ఈ ప్రక్రియ ఎంత గోప్యంగా ఉంటుంది?

కార్డినల్స్ తమ ఫోన్లను అప్పగించి గోప్యత ప్రమాణం చేస్తారు. ఇది ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. చాపెల్‌లో బగ్స్ ఉన్నాయా అన్నదాన్ని తనిఖీ చేస్తారు. ఓటింగ్ సమయంలో కార్డినల్స్ తమ ఎంపికను కాగితం ముక్కపై రాసి, మడిచి, ప్రమాణం చేసి, ఓటు వేస్తారు. ఈ ఓట్లను కాల్చినపుడు నల్ల పొగ లేదా తెలుపు పొగ వచ్చేందుకు రసాయనాలు వాడతారు.

ఎవరెవరు ఓటు వేయగలరు? 

80 ఏళ్లలోపు ఉన్న 135 కార్డినల్స్ ఓటు హక్కు కలిగినవారు. అయితే శారీరక అస్వస్థత వల్ల ఇద్దరు పాల్గొనలేకపోతున్నారు. దీంతో పోప్‌గా ఎన్నిక కావాలంటే కనీసం 89 ఓట్లు రావాల్సి ఉంటుంది. సాంకేతికంగా పోప్ కార్డినల్ కావాల్సిన అవసరం లేదు కానీ గత మూడు శతాబ్దాల్లో ప్రతి పోప్ కూడా కార్డినలే. పోప్ ఫ్రాన్సిస్ నియమించిన 108 మంది ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. 

కొత్త పోప్ ఎంపిక ఎలా తెలిసిపోతుంది?

సిస్టైన్ చాపెల్ పై తెలుపు పొగ వెలువడినపుడు అది పోప్ ఎంపిక అయిందనే సంకేతం. వెంటనే సెయింట్ పీటర్ స్క్వేర్ జనాలతో నిండిపోతుంది. సీనియర్ కార్డినల్ "హబేమస్ పాపమ్" (మాకు పోప్ వచ్చాడు) అని ప్రకటించి కొత్త పోప్ పేరు వెల్లడిస్తారు. కొత్త పోప్ ఆత్మీయ ఆశీర్వాదంతో తన పదవీ కాలాన్ని ప్రారంభిస్తాడు.

గత రెండు శతాబ్దాల్లో పోప్ ఎంపికకు నాలుగు రోజులకు మించి సమయం పడలేదు. కొన్ని శతాబ్దాల కిందట ఇది అరేళ్ల పాటు కూడా సాగింది. 2013లో పోప్ ఫ్రాన్సిస్ రెండో రోజునే ఎంపికయ్యారు. ఈసారి కూడా తెలుపు పొగ త్వరలో కనిపించనున్నదన్న అంచనాలే ఉన్నాయి.