కరోనా మహమ్మారి మళ్లీ తిరగపెడుతోంది. గతేడాది డిసెంబర్ లో ప్రపంచ దేశాలను చుట్టేసిన ఈ కరోనా వైరస్.. ఈ ఏడాది చివరి నాటికి కాస్త తగ్గినట్లే కనిపించింది. ఇప్పుడిప్పుడే దీనికి వ్యాక్సిన్ కనుగొని దానిని పంపిణీ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో.. కరోనా సెకండ్ వేవ్ మొదలుపెట్టింది. దీంతో.. మళ్లీ లాక్ డౌన్ దిశగా పలు దేశాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

తాజాగా మన పొరుగుదేశం భూటాన్‌లో ఏడు రోజుల పాటు లాక్‌డౌన్ విధించారు. ఇవాళ్టి నుంచే ఇది అమల్లోకి వస్తుంది. కరోనా నేపథ్యంలో భూటాన్‌లో జిల్లాల మధ్య కొన్ని రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా థింపు, పారో, లామోజింఖాలో కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది.

భూటాన్ వ్యాప్తంగా అత్యవసర సేవలకు మాత్రమే లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు మాత్రం తెరిచి ఉంటాయి. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు, వ్యాపార సముదాయాలన్నీ మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. నిత్యావసర సరుకులు, మందులు, యానిమల్ ఫీడ్ వంటి సరుకు రవాణాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ప్రభుత్వం తెలిపింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని సూచించింది.