బెర్ముడా ట్రయంగిల్ మిస్టరీపై ఎన్నో కథలు, సినిమాల్లో ప్రస్తావనలు ఉన్నాయి. ఈ అంతుచిక్కని రహస్యం అంతుచూశానని ఆస్ట్రేలియా సైంటిస్టు చెబుతున్నాడు. ఆ మిస్టరీ వెనుక అతీత శక్తులు, ఏలియన్ల ప్రమేయం ఏమీ లేదని, ఇది వరకు ప్రచారంలో ఉన్న కట్టుకథలను, వృత్తాంతాలను ఖండించారు. ఈ ట్రయంగిల్‌లో జరిగిన ప్రమాదాలకు తనదైన విశ్లేషణతో వివరణ కూడా ఇచ్చారు. 

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వేధిస్తున్న మిస్టరీల్లో బెర్ముడా ట్రయంగిల్(Bermuda Triangle Mystery) ఒకటి. ఈ మిస్టరీ సాల్వ్ చేయడానికీ సాహసవంతులు కూడా వణికిపోయారు. ఎందుకంటే.. దాన్ని సాల్వ్ చేయాలంటే ప్రాణాలను పణంగా పెట్టాలి. అయితే, ఆ రహస్యం గుట్టు విప్పినట్టు ఆస్ట్రేలియాకు చెందిన ఓ సైంటిస్టు ప్రకటించారు. ఇంతకీ బెర్ముడా ట్రయంగిల్ మిస్టరీ ఏమిటీ? సైంటిస్టు(Australian Scientist) చెప్పిన విషయాలేమిటో చూద్దాం..

అట్లాంటిక్ మహాసముద్రంలో మూడు బిందువులను కలుపుతూ ఊహాజనిత రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని బెర్ముడా ట్రయంగిల్ అనొచ్చు. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే బెర్ముడా దేశం, పోర్టోరికో, మయామీ ప్రాంతాల మధ్య ఉన్న అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతాన్నే బెర్ముడా ట్రయంగిల్ అంటారు. ఇది సుమారు ఐదు లక్షల చదరపు మైళ్ల విస్తీర్ణం ఉంటుంది. దీని చుట్టూ ఉన్న మిస్టరీ ఏమిటంటే.. ఈ ట్రయంగిల్ గుండా వెళ్లిన పడవలు, ఓడలు మళ్లీ భూమిపై అడుగుపెట్టలేవని, నాశనం అయిపోయాయని చెబుతారు. కేవలం ఆ ట్రయంగిల్ ప్రాంతంలోని సముద్రంపై ఈదుతూ వెళ్లిన ఓడలే కాదు.. ఆ ప్రాంతంపై ఎగురుతూ అంటే ఆ కాశంలో వెళ్లిన విమానాలు కూడా మళ్లీ వెనక్కి రావనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అభిప్రాయాలు ఏర్పడటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.

ఈ ప్రాంతం గుండా వెళ్లిన పదుల సంఖ్యలో పడవలు, ఓడలు, విమానాలు కనిపించకుండా పోయాయి. వాటిలోని సిబ్బంది బ్రతకడం కాదు.. కదా కనీసం వాటి శిథిలాలు కూడా దొరకలేవు. వాటిని వెతకడానికి వెళ్లిన విమానాలు సైతం మళ్లీ వెనక్కి రాలేవు. దీంతో బెర్ముడా ట్రయంగిల్ చుట్టూ అనేక వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి. అతీత శక్తులు, ఏలియన్ల వంటి ప్రస్తావనలు ఈ వృత్తాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. 

బెర్ముడా ట్రయంగిల్ అంటే 1945 డిసెంబర్ 5న ఆ ప్రాంతం గుండా ఎగిరిన అమెరికాకు చెందిన రక్షణ బలగాలు విమానాలను (ఫ్లైట్ 19) గుర్తు చేస్తారు. ఫ్లోరిడా నుంచి ఐదు విమానాలు 14 మంది సిబ్బందితో బయల్దేరి వెళ్లాయి. కొంత కాలానికి అవి కాంటాక్టు కోల్పాయి. ఆ తర్వాత వాటి గురించిన సమాచారం ఏమీ రాలేదు. విమాన శిథిలాలు, సిబ్బందికి సంబంధించి ఒక శకలం, ఇతర చిహ్నాలు ఏమీ కనిపించలేవు. వాటి కోసం వెతకడానికి వెళ్లిన ఓ ప్లేన్ కూడా అదే రోజు అదృశ్యమైపోయింది.

ఇక ఆస్ట్రేలియా సైంటిస్టు విషయానికి వస్తే.. సిడ్నీ యూనివర్సిటీ కారల్ క్రూస్జెనికీ ఈ మిస్టరీని సాల్వ్ చేసినట్టు ప్రకటించారు. ఈ మిస్టరీ వెనుక ఎలాంటి అతీత శక్తులు లేదా ఏలియన్లు లేవని స్పష్టం చేశారు. బెర్ముడా ట్రయంగిల్ గుండా వెళ్లిన పడవలు, ఓడలు, విమానాలు అదృశ్యం కావడం వెనుక ఎలాంటి అతీత శక్తులు లేవని వివరించారు. సంపన్నమైన అమెరికా దేశం సమీపంలోనే ఈ ట్రయంగిల్ ఉన్నదని, ఇది చాలా బిజీ ప్రాంతం అని తెలిపారు. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉండటం సహజం అని పేర్కొన్నారు.

భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ఈ ప్రాంతంలో జరిగే ప్రమాదాల శాతం తీస్తే.. భూగ్రహంపై ఉన్న ఇతర సముద్ర జలాల్లో జరిగే ప్రమాదాల శాతం తీస్తే అసాధారణంగా ఏమీ లేదని లెక్కగట్టారు. ఇందుకోసం ఆయన లండన్‌కు చెందిన లాయిడ్స్, అమెరికా కోస్ట్‌గార్డు లెక్కలను ఆధారంగా తీసుకున్నారు. శాతాల వారీగా చూస్తే ఇతర సముద్ర జలాల్లో అదృశ్యం అవుతున్న ఘటనలు సంఖ్య కూడా బెర్ముడా ట్రయంగిల్‌లో అదృశ్యమైన సంఖ్యతో దాదాపు సమానంగా ఉన్నాయని ఆయన తెలిపారు. బెర్ముడా ట్రయంగిల్‌లో జరిగే ఘటనలకు మానవ తప్పిదాలే కారణంగా ఉండొచ్చని వివరించారు. కాగా, ఫ్లైట్ 19 ఘటనకూ తనదైన వివరణ ఇచ్చారు. ఆ రోజు అట్లాంటిక్‌లో 15 మీటర్ల ఎత్తుతో వచ్చిన అలలు ఆ దుర్ఘటనకు కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. ఆ ఐదు విమానాల లీడర్ మాత్రమే పైలట్లు అందరిలోకి అనుభవం ఉన్నవాడని, బహుశా ఆ పైలట్ మానవ తప్పిదం కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలిపారు.