లెబనాన్ రాజధాని బీరూట్ ను భారీ విస్ఫోటనం వణికించింది. కెమెరాకు చిక్కిన వీడియోను చూస్తే బ్లాస్ట్ ఏ స్థాయిలో సంభవించిందో అర్థమయిపోతుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 78 మంది మరణించినట్టు తెలుస్తుంది. 4 వేల మంది క్షతగాత్రులుగా ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. 

కొన్ని కూలిపోయిన బిల్డింగ్స్ శిథిలాల కింద ఇంకా ప్రజలు చిక్కుకొని ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బీరూట్ నగరంతా గాజు పెంకులతో నిండిపోయింది. ప్రజల ఆర్తనాదాలు, హాహాకారాలతో భయానకమైన వాతావరణం అక్కడ మనకు దర్శనమిస్తుంది. 

తొలుత బాంబు బ్లాస్టులుగా భావించినప్పటికీ.... ఇది బాంబు బ్లాస్టు కాదని తదుపరి విచారణలో తేలింది. ఒక గోడౌన్ లో ఉంచిన 2750 కిలోల అమ్మోనియం నైట్రేట్ విస్ఫవుతానం వల్ల ఈ భారీ పేలుడు సంభవించినట్టు తెలిసింది. ఆరు సంవత్సరాలుగా ఇంత భారీ స్థాయిలో అమ్మోనియం నైట్రేట్ ని ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా నిల్వ చేయడం పై లెబనాన్ ప్రధాని తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తూ... ఎంతటివారినైనా వదిలేది లేదు అని అన్నాడు. 

పేలుళ్ల ధాటికి ఆ పరిసరాల్లోని భవంతులు పేకమేడల్లా కూలిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు, కిటికీలు కూడా మిగిలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

వచ్చిన క్షతగాత్రులతో బీరూట్ రాజధాని ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఎక్కడా కూడా ఖాళీలు లేని పరిస్థితి. అత్యవసరంగా సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వం దాదాపుగా 500 కోట్ల రూయాలను ప్రకటించింది. నగరమంతా దట్టమైన పొగ అలుముకుంది. పేలుడు శబ్దాన్ని 140 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ దేశంలో కూడా విన్నారంటే..... ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 

అమ్మోనియం నైట్రేట్ ని పొలాలకు ఎరువులను తయారుచేయడానికి, బాంబులను తయారు చేయడానికి వాడతారు. దీని వల్లనే విస్ఫోటనం జరిగినట్టుగా తెలుస్తుంది. అక్రమంగా నిలువ ఉంచిన అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ వర్గాలు వీటిని ఒక గోడౌన్ లో భద్రపరిచాయి. ఈ గోడౌన్ లోనే విస్ఫోటనం జరిగినట్టు తెలుస్తుంది.