నైరుతి బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఒక గుంపు హిందూ దేవాలయం, దుకాణాలపై దాడి చేయడమే కాకుండా హిందువులకు చెందిన అనేక ఇళ్లను ధ్వంసం చేసింది. 

నైరుతి బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. ఒక గుంపు హిందూ దేవాలయం, దుకాణాలపై దాడి చేయడమే కాకుండా హిందువులకు చెందిన అనేక ఇళ్లను ధ్వంసం చేసింది. ఓ యువకుడి ఫేస్‌బుక్ పోస్ట్ ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని ఆరోపిస్తూ ఈ హింస చోటుచేసుకుందని మీడియా నివేదికలు తెలిపాయి. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నరైల్ జిల్లాలోని సహపరా గ్రామంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు.. యువకుడి ఫేస్‌బుక్ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యువకుడి ఇంటి వెలుపల నిరసనకు దిగారు. అనంతరం ఇళ్లపై దాడి చేశారు. కొన్ని ఇళ్లను నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే గుంపులోని కొందరు ఆలయంలోకి చొరబడి లోపల ఉన్న ఫర్నిచర్‌ను పగులగొట్టారు. అక్కడ ఉన్న అనేక దుకాణాలను ధ్వంసం చేశారు.

శుక్రవారం సాయంత్రం నరైల్ జిల్లాలోని సహపరా గ్రామంలో అనేక ఇళ్లను ధ్వంసం చేసి, వాటిలో ఒకదానిని తగులబెట్టిన గుంపును చెదరగొట్టడానికి పోలీసులు హెచ్చరిక షాట్‌లు పేల్చారని స్థానిక పోలీసు ఇన్‌స్పెక్టర్ హరన్ చంద్ర పాల్‌ని ఉటంకిస్తూ ఒక ఆన్‌లైన్ వార్తాపత్రిక పేర్కొంది. రాత్రి 7:30 గంటల సమయంలో దాడి జరిగిందని.. గ్రామంలోని ఆలయంపై కూడా దాడి చేసిన వ్యక్తులు ఇటుకలను విసిరారని ఇన్‌స్పెక్టర్ హరన్ చంద్ర చెప్పారు. ఆలయంలోని ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. ఈ దాడుల్లో అనేక దుకాణాలు కూడా ధ్వంసం చేయబడ్డాయని ది డైలీ స్టార్ వార్తాపత్రిక నివేదించింది.

ఫేస్‌బుక్‌లో ఓ యువకుడు అభ్యంతరకరంగా ఏదో పోస్ట్ చేశాడని.. ముస్లింలు ఆగ్రహంతో దాడులు చేశారని హరన్ చెప్పారు. ఆ యువకుడి కోసం వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అతని తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టుగా సమాచారం. అయితే రాత్రికి పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టుగా హరన్ తెలిపారు.

నరైల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రబీర్ కుమార్ రాయ్ మాట్లాడుతూ.. ‘‘పరిస్థితిని అదుపులో ఉంచడానికి అధికారులు వారి విధులను నిర్వర్తిస్తున్నారు. మేము ఘటనపై దర్యాప్తు చేస్తున్నాము. హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి పరిస్థితి సాధారణంగా ఉంది” అని చెప్పారు. ఇక, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు ది డైలీ స్టార్ వార్తాపత్రిక పేర్కొంది.

అయితే ఈ దాడి తర్వాత చాలా మంది గ్రామాన్ని విడిచిపెట్టినట్టుగా సమాచారం. దాదాపు అన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. కొన్ని కుటుంబాలు మాత్రం గ్రామంలోనే ఉన్నారని.. వారు తీవ్ర భయాందోళన చెందుతున్నట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి. 

ముస్లిం మెజారిటీ ఉన్న బంగ్లాదేశ్‌లో మతపరమైన మైనారిటీలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. వాటిలో చాలా వరకు సోషల్ మీడియా ద్వారా పుకార్లు, నకిలీ పోస్ట్‌లు వ్యాప్తితో జరుగుతున్నవే. న్యాయ హక్కుల సంఘం Ain O Salish Kendra నివేదిక ప్రకారం.. జనవరి 2013 నుంచి సెప్టెంబర్ 2021 మధ్య బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై 3,679 దాడులు జరిగాయి.