Asianet News TeluguAsianet News Telugu

శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స దేశం విడిచివెళ్లకుండా కోర్టు నిషేధాజ్ఞాలు

శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఇతరులు దేశం విడిచి వెళ్లకుండా స్థానిక కోర్టు నిషేధాజ్ఞలు విధించింది. శాంతియుత నిరసనకారులపై దాడులకు దింపారనే ఆరోపణల నేపథ్యంలో శ్రీలంకలో జరిగిన హింసపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించింది.
 

ban on sri lanka former pm mahinda rajapaksa leaving country by court
Author
New Delhi, First Published May 12, 2022, 4:22 PM IST

న్యూఢిల్లీ: శ్రీలంక ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై హింసాత్మక దాడుల కేసులో భాగంగా దేశ మాజీ ప్రధానమంత్రి మహింద రాజపక్స, ఆయన కొడుకు నమల్ రాజపక్స, మరో 15 మంది అనుచరులు బయటి  దేశాలకు వెళ్లకుండా కోర్టు నిషేధాజ్ఞలు విధించింది. సోమవారం నాడు శ్రీలంకలో జరిగిన మూక దాడులపై దర్యాప్తు చేయాలని రాజధాని కొలంబోలోని మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించింది. అంతేకాదు, మహింద రాజపక్సకు వ్యతిరేకంగా అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ డిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. ఎందుకంటే.. కేసు విచారిస్తున్న పోలీసులకు అనుమానితులను అరెస్టు చేసే అధికారాలు ఎలాగూ ఉంటాయి కదా అని పేర్కొంది.

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పటి నుంచి ప్రధానమంత్రి, అధ్యక్షుడు, ఇతర మంత్రులు రాజీనామాలు చేయాలని ప్రజలు శాంతియుత నిరసనలు చేస్తున్నారు. అప్పటి ప్రధానమంత్రి మహింద రాజపక్స నివాసం ఎదుట కూడా ఈ ప్రదర్శనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మహింద రాజపక్స నివాసానికి సుమారు 3000 మంది అనుచరులు ఇతర చోట్ల నుంచి రాజధానికి బస్సుల్లో రప్పించారు. వారు మహింద రాజపక్సతో భేటీ అయిన తర్వాత ఆయన నివాసం నుంచి బయటకు వచ్చి శాంతియుత ఆందోళన చేస్తున్న నిరసనకారులపై విరుచుకుపడ్డారు. హింసకు తెరలేపారు. ప్రతిదాడిగా దేశవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అధికార నాయకులు, వారి ఆస్తులపై ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ హింసలో కనీసం 225 మంది గాయపడ్డారు. తొమ్మిది మంది మరణించినట్టు తెలిసింది.

దేశంలో హింసాత్మక ఆందోళనలు చెలరేగిన నేపథ్యంలో మహీంద రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి నావల్ బేస్‌లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహీంద రాజపక్స సోదరుడు, దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నూతన ప్రధాని కోసం ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా, రానిల్ విక్రమ్ సింఘే ఈ రోజు శ్రీలంక ప్రధానిగా ప్రమాణం చేయబోతున్నట్టు తెలిసింది. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం తీసుకోబోతున్నట్టు సమాచారం. నిన్న సాయంత్రం రానిల్ విక్రమ్ సింఘే.. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సతో సమావేశం అయ్యారు.

పార్లమెంటులో ఒకే సీటు
రానిల్ విక్రమ్ సింఘే ఇది వరకు నాలుగు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గత ప్రభుత్వంలో మైత్రిపాల సిరిసేన ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత మళ్లీ ప్రధానిగా స్వీకరించారు. కానీ, గత పార్లమెంటు ఎన్నికల్లో రానిల్ విక్రమ్ సింఘే పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీ దారుణంగా తుడిచిపెట్టుకుపోయింది. 225 స్థానాలున్న పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోనే పురాతనమైన ఈ పార్టీ కేవలం ఒకే సీటు గెలిచింది. గెలిచింది కూడా ఆ పార్టీ చీఫ్ రానిల్ విక్రమ్ సింఘే మాత్రమే. ఇప్పుడా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. కానీ, దేశంలోని తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే బంపర్ ఆఫర్ వచ్చింది.

ప్రధానమంత్రిగా రానిల్ విక్రమ్ సింఘే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు పార్లమెంటులో మెజార్టీ మద్దతు లభిస్తుందని ఆయన పార్టీ యూఎన్‌పీ చైర్మన్ వజీరా అబెయవర్దనే తెలిపారు. అధికారపక్షం శ్రీలంక పోదుజన పేరమునా పార్టీ, ప్రధాన ప్రతిపక్ష వర్గం సమాగి జన బలవేగయా సహా ఇతర పార్టీలు రానిల్ విక్రమ్ సింఘేకు మద్దతు ఇస్తారని రాజకీయవర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios