పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈ మేరకు మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, నేషనల్ అసెంబ్లీలో విపక్ష నేత రాజా రియాజ్‌లు నిర్ణయం తీసుకున్నారు. 

పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు చెందిన సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికైనట్లు నేషనల్ అసెంబ్లీ (ఎన్‌ఏ)లో పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ శనివారం తెలిపినట్లు ది డాన్ వార్తా సంస్థ తెలిపింది. ప్రధాని నివాసం వెలుపల జరిగిన పరిణామాన్ని రియాజ్ మీడియాకు తెలియజేశారు. విపక్ష నేత , పదవీ విరమణ చేసిన ప్రధాని షెహబాజ్ షరీఫ్ తుది దఫా సంప్రదింపులు జరిపిన కొద్దిసేపటికే ఈ విషయం వెల్లడైంది.

Scroll to load tweet…

షెహబాజ్ షరీఫ్ అంతకుముందు రేడియో పాకిస్తాన్‌తో మాట్లాడుతూ.. తాత్కాలిక ప్రభుత్వ అధిపతి పేరును శనివారం నాటికి ఖరారు చేస్తామని చెప్పారు. ప్రధానితో సమావేశం తరువాత ప్రతిపక్ష నాయకుడు , పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకుడు రియాజ్ మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక ప్రధాన మంత్రి చిన్న ప్రావిన్స్ నుండి ఉండాలని తాను షెహబాబ్ నిర్ణయించుకున్నామని చెప్పారు. దీని ప్రాకరం అన్వరుల్ హక్ కాకర్ తాత్కాలిక ప్రధానిగా వుండేందుకు ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందని రియాజ్ తెలిపారు. తాను కాకర్ పేరును ప్రతిపాదించగా.. షెహబాజ్ సమ్మతించారని ఆయన పేర్కొన్నట్లు ది డాన్ వెల్లడించింది. 

ఆగస్ట్ 13న తాత్కాలిక ప్రధానిగా కాకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) (పీఎంఎల్ ఎన్) సూచించిన వారికి బదులుగా తాను సూచించిన అభ్యర్ధిని ఎంపిక చేయాలని రాజా రియాజ్ పట్టుబట్టడం వల్లే తాత్కాలిక ప్రధాని పేరు ప్రకటనలో జాప్యం జరిగిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. మాజీ ఆర్ధిక మంత్రి ఇషాక్ దార్‌ను తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేయాలని పాక్ మాజీ ప్రధాని, పీఎంఎల్ఎన్ అధిపతి నవాజ్ షరీఫ్ కోరుకున్నట్లు వార్తలు వచ్చాయి. దార్ కానీ పక్షంలో మాజీ ప్రధాని షాహీద్ ఖాకాన్ అబ్బాసీని తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేయాలని నవాజ్ షరీఫ్ కోరుకున్నారట. 

కాగా.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని ఆ దేశ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ బుధవారం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని షెహబాజ్ షరీఫ్ సిఫారసు మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర ప్రభుత్వానికి నాయకత్వం వహించే వారిపై చర్చించేందుకు తాను విపక్షనేతను కలుస్తానని షెహబాజ్ ఇప్పటికే తెలిపారు. పాక్ రాజ్యాంగం ప్రకారం జాతీయ అసెంబ్లీని గడువుకు ముందే రద్దు చేస్తే 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాల్సి వుంటుంది.