Asianet News TeluguAsianet News Telugu

అడవిలో తప్పిపోయిన మూడేళ్ల బాలుడు.. 3 రోజుల తర్వాత మురికినీరు తాగుతూ..

ఆస్ట్రేలియాలో ఓ బాలుడు కుటుంబం నుంచి దూరంగా వెళ్లి అడవిలో తప్పిపోయిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేస్తే ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి ముమ్మర గాలింపులు చేసింది. గల్లంతైన మూడు రోజుల తర్వాత ఆ బాలుడు పోలీసు కెమెరాకు చిక్కాడు. విపరీతమైన దాహంతో మురికి నీటిని తాగుతూ హృదయవిదారక స్థితిలో కనిపించాడు.

australian boy who had gone missing found after three days
Author
Sydney NSW, First Published Sep 6, 2021, 6:21 PM IST

సిడ్నీ: ఓ మూడేళ్ల బాలుడు ఇంటి నుంచి తప్పిపోయాడు. సమీపంలోని అడవిలో మిస్ అయ్యాడు. పోలీసులకు విషయం చెప్పగా, ముమ్మర గాలింపులు మొదలుపెట్టారు. తప్పిపోయిన మూడు రోజుల తర్వాత ఆ బాలుడు కనిపించాడు. అడవిలో ఓ కందకం వంటి ప్రదేశంలో కూర్చుని దాహంతో మురికి నీరు తాగుతూ కనిపించాడు. ఆ హృదయవిదారక దృశ్యం పోలీసులతోపాటు ఆ వీడియో చూసిన నెటిజన్లను కంటతడి పెట్టిస్తున్నది.

 

సిడ్నీకి చెందిన మూడేళ్ల బాలుడు ఆంథోనీ ఏజే ఎల్ఫలక్ కుటుంబం నుంచి తప్పిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నౌ సౌత్ వేల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. హెలికాప్టర్లతో గాలింపులు మొదలుపెట్టారు. వారి కెమెరా కంటికి బాలుడు వాయవ్య సిడ్నీకి 150 కిలోమీటర్ల దూరంలో నీటి గుంత దగ్గర కూర్చుని కనిపించాడు. దాహంతో ఆ బాలుడు కొట్టుమిట్టాడుతున్నాడు. గుంతలోని నీళ్లను కడుపు నిండా తాగడానికి విఫలప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే ఎమర్జెన్సీ టీమ్ ఆ బాలుడిని రక్షించింది.

అనంతరం బాలుడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కొంత ఎత్తు నుంచి కిందపడ్డట్టు తోస్తున్న గాయాలు, రాపిడి చాయలు కనిపించాయని వైద్యులు తెలిపారు. అయితే, ఆ బాలుడు ఎందుకు కుటుంబం నుంచి దూరంగా వెళ్లి తప్పిపోయాడే తెలియరాలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios