హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ టీకాను (Covaxin) ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారు తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది.
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ అభివృద్ది చేసిన కొవాగ్జిన్ టీకాను (Covaxin) ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్నవారు తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ నియంత్రణ చేసే థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ (TGA) ఒక ప్రకటన చేసింది. కరోనా వ్యాప్తిని తగ్గించే ప్రభావవంతమైన టీకాల అదనపు సమాచారాన్ని టీజేఏ ఇటీవలే సేకరించింది. ఈ వివరాలను పరిశీలించింన అనంతరం కొవాగ్జిన్, చైనా సినోఫార్మ్ అభివృద్ధి చేసిన బీబీఐబీపీ-కరోనా వ్యాక్సిన్లను అధికారికంగా గుర్తిస్తున్నట్లు తెలిపింది. ఇక, కొవాగ్జిన్ టీకాను భారత్ సహా చాలా దేశాల్లో ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఆస్ట్రేలియా నిర్ణయంతో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఆ దేశంలో పర్యటించడం సులభం కానుంది.
‘భారత్‌కు చెందిన Covaxin, చైనాకు చెందిన BBIBP-CorV గుర్తించాం. గతంలో గుర్తించిన కరోనావాక్ (సినోవాక్, చైనాచే తయారు చేయబడింది), కోవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా, భారత్ నుంచి తయారు చేయబడింది) యొక్క గుర్తింపు ఇవ్వడం జరిగింది. దీంతో చైనా, భారతదేశం నుంచి ఈ వ్యాక్సిన్‌లు పొందిన అనేక మంది ఆస్ట్రేలియాలో ప్రవేశించినప్పుడు పూర్తిగా టీకాలు వేసినట్లు పరిగణించబడతారు. ఇది అంతర్జాతీయ విద్యార్థుల తిరిగి రావడానికి, ఉద్యోగుల ప్రయాణంపై ఆస్ట్రేలియాకు గణనీయమైన ప్రభావాలను చూపుతోంది’అని టీజీఏ ట్విట్టర్‌లో పేర్కొంది.
Also read: కొవాగ్జిన్‌పై అదనపు వివరణలు కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇంకా పెండింగ్‌లోనే..
ఇక, కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఆమోదం కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ టీకాను అత్యవసర జాబితాలో చేర్చాలని భారత్ బయోటెక్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేసుకన్న సంగతి తెలిసిందే. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) కోసం ఈవోఐ(ఎక్ప్‌ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్) సమర్పించింది. ఈ క్రమంలోనే జూలై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్ ప్రక్రియను ప్రారంభించినట్టుగా డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు అవసరమైన సమాచారాన్ని World Health Organisationకు ఇప్పటికే సమర్పించామని భారత్ బయోటెక్ వర్గాలు వెల్లడించాయి.
Also read: WHO: చైనా టీకాలకు అనుమతులిచ్చి.. కొవాగ్జిన్‌ను ఎందుకు ఆపారు?.. డబ్ల్యూహెచ్‌వో సమాధానమిదే..!
అయితే కొవాగ్జిన్ కు సంబంధించి అదనపు సమాచారం కావాలని డబ్ల్యూహెచ్ఓకు చెందిన సాంకేతిక సలహా సంఘం మంగళవారం భారత్ బయోటెక్‌ను కోరింది. కొవాగ్జిన్ కు అనుమతుల జారీ ప్రక్రియ తుది అంకంలో ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ వర్గాలు పేర్కొన్నాయి. కొవాగ్జిన్ టీకా యొక్క అత్యవసర వినియోగ జాబితా కోసం తుది "రిస్క్-బెనిఫిట్ అసెస్‌మెంట్" నిర్వహించడానికి డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం నవంబర్ 3వ తేదీన సమావేశం కానుంది.
