సారాంశం
అమెరికా టెక్సాస్ షాపింగ్ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు.
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్ షాపింగ్ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు దిగిన దుండగుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. మాల్ లో కాల్పులు జరిగిన సమయంలో అదే మాల్ లో ఉన్న ఓ పోలీస్ అధికారి దుండగుడిని కాల్పి చంపినట్టుగా పోలీస్ అధికారులు ధృవీకరించారు.
క్షతగాత్రులను మూడు ఆసుపత్రుల్లో చేర్పించారు. గాయపడిన వారిలో ఐదు నుండి 60 ఏళ్ల లోపు వారు ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటనను అంతులేని విషాదంగా టెక్సాస్ గవర్నర్ పేర్కొన్నారు.
అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం మూడుున్నర గంటల సమయంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పులకు దిగిన వ్యక్తితో పాటు ఏడుగురు షాపింగ్ మాల్ లోనే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. గాయపడిన ఏడుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
అమెరికాలో తరచుగా ఈ తరహా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దుండగులు అకారణంగా కాల్పులకు దిగి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. అమెరికాలో విచ్చలవిడిగా ఆయుధాల విక్రయం కూడా తరహా ఘటనలకు కారణమౌతున్నాయనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.
కాల్పులకు దిగిన దుండగుడు ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. అయితే అతను ఎందుకు కాల్పులకు దిగాడో తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దుండగుడు కాల్పులకు దిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకొనేందుకుమాల్ లో ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు.