అమెరికాలోని అలబామాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. ఉత్తర అలబామాలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయంఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్ యార్డ్ లో ఈ ప్రమాదం జరిగింది. 

దాదాపు 35 పడవలు మంటల్లో చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ విషయంపై స్కాట్స్ బోరో అగ్నిమాపక అధికారి జెనె నెక్లాస్ మాట్లాడుతూ చాలా మంది గల్లంతయ్యారని పడవలో ఎంత మంది ఉన్నారో తెలియదని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.  తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించనున్నట్లు తెలిపారు.

Also Read ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం: 83 మంది మృతి..?

మొదట ఆదివారం అర్థరాత్రి జాక్సన్ కంట్రీ పార్క్ కి అంటుకున్న మంటలు ఆ తర్వాత డాక్ యార్డ్ వైపుకు వేగంగా విస్తరించాయి. పడవల్లో ఎక్కువ మంది గాఢనిద్రలో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెబుతున్నారు. అంతేకాకుండా అవి ఎక్కువగా చెక్కలతో నిర్మించినవి కావడంతో మంటలు మరింత తొందరగా వ్యాపించాయని చెబుతున్నారు.

పడవలపై ఉండే అల్యూమినియం రేకులు విరిగిపడటంతో.. మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించడం కుదరలేదని చెబుతున్నారు. చాలా మంది ప్రాణాలు కాపాడుకునేందుకు టెన్నెస్సీ నదిలోకి దూకారు. వారిని మాత్రం అధికారులు రక్షించగలిగారు.