సోమాలియా రాజధాని మొగదిషులో జంట కారు బాంబు పేలుళ్లతో కనీసం 100 మంది మరణించారు. మొగదిషులోని విద్యా మంత్రిత్వ శాఖ సమీపంలో  రద్దీగా ఉండే జంక్షన్ వద్ద శనివారం ఈ దాడి చోటుచేసుకుంది. 

సోమాలియా రాజధాని మొగదిషులో జంట కారు బాంబు పేలుళ్లతో కనీసం 100 మంది మరణించారు. మొగదిషులోని విద్యా మంత్రిత్వ శాఖ సమీపంలో రద్దీగా ఉండే జంక్షన్ వద్ద శనివారం ఈ దాడి చోటుచేసుకుంది. ఈ పేలుళ్లు ఒకదాని తర్వాత ఒకటి నిమిషాల వ్యవధిలో జరిగాయి. ఈ దాడిలో మరో 300 మందికి పైగా గాయపడ్డారని సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహముద్ తెలిపారు. గాయపడినవారికి అంతర్జాతీయ వైద్య సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యా మంత్రిత్వ శాఖను లక్ష్యంగా చేసుకుని అల్-షబాబ్ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.

‘‘నైతికంగా దివాళా తీసిన, నేరస్థులైన అల్-షబాబ్ గ్రూప్ అమాయక ప్రజలపై ఇటువంటి క్రూరమైన, పిరికిపూరితమైన ఉగ్రదాడికి పాల్పడింది. ఈ ఉగ్రదాడి మమ్మల్ని నిరుత్సాహపరచదు. ఇది వారిని ఓడించాలనే మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది’’ మొహముద్ పేర్కొన్నారు. ఇక, అల్-ఖైదా అనుబంధ సంస్థ అల్-షబాబ్ ఫెడరల్ సోమాలియా ప్రభుత్వంతో దీర్ఘకాలంగా వివాదంలో నిమగ్నమై ఉంది. అయితే ఈ దాడికి బాధ్యులని తక్షణమే ఏ సంస్థ ప్రకటించలేదు. అయితే ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఇతర దాడులకు అల్-షబాబ్ బాధ్యత వహించింది. ఇక, ‘‘మా ప్రభుత్వం, ధైర్యవంతులు సోమాలియాను చెడు నుండి రక్షించడం కొనసాగిస్తారు’’ అని మొహముద్ తెలిపారు. 

శనివారం పేలుళ్ల తర్వాత వందలాది మంది ప్రజలు ఘటన స్థలానికి చేరకుని.. వారి కుటుంబ సభ్యుల కోసం వెతకడం కనిపించింది. మృతి చెందిన వారిలో ప్రముఖ జర్నలిస్టు, సీనియర్ పోలీసు అధికారి కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. దాదాపుగా ఇదే ప్రాంతంలో 2017 అక్టోబర్ 14న జరిగిన ఘోర బాంబు దాడిలో 500 మందికి పైగా మరణించారు. దీనిని దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన దాడిగా పేర్కొంటారు. 

ఇక, పేలుళ్లు చోటుచేసుకున్న స్థలాన్ని పరిశీలించిన అనంతరం మొహమూద్ మాట్లాడుతూ.. ‘‘దేవుడి ఆశీసులతో.. అక్టోబరులో ఇటువంటి దాడులు మళ్లీ జరగవని సోమాలియా ప్రజలకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను’’అని అన్నారు. ఇక, ఈ దాడిని అమెరికా, టర్కీ, ఖతార్, జర్మనీ దేశాలు ఖండించాయి.