Asianet News TeluguAsianet News Telugu

అర్జెంటినా ఉపాధ్యక్షురాలికి తప్పిన ప్రాణముప్పు.. తలకు గురి పెట్టి షూట్.. పేలని తుపాకీ.. షాకింగ్ వీడియో

అర్జెంటినా దేశ ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ డీ కిర్చనర్‌కు ప్రాణహాని తప్పింది. ఆమె మద్దతుదారుల మధ్యలో నుంచి ఓ దుండగుడు గన్ తీసి ఆమెకు ఎక్కు పెట్టాడు. ట్రిగ్గర్ నొక్కినా పేలలేదు. దీంతో ఆమె ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. అధికారులు వెంటనే ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది.
 

assassination attempt on argentina vice president Cristina Fernandez de Kirchner.. pulled trigger but gun did not fire
Author
First Published Sep 2, 2022, 3:01 PM IST

న్యూఢిల్లీ: అర్జెంటినా ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ డీ కిర్చనర్‌కు తృటిలో ప్రాణ హాని తప్పింది. ఓ దుండగుడు ఆమెను హతమార్చడానికి ప్రయత్నించాడు. ఆమె ఎదురుగా ఉండి గన్ తలకు గురిపెట్టి షూట్ చేశాడు. కానీ, ఆ తుపాకీ పేలలేదు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. అంతలోపే ఆమె చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది, మద్దతుదారులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటన అర్జెంటినా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఆమె నివాసం దగ్గర గురువారం రాత్రి చోటుచేసుకుంది.

దక్షిణ అమెరికా ఖండంలో కొలంబియా మొదలు బ్రెజిల్ వరకు రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో రాజకీయ నేతలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అర్జెంటినా ఉపాధ్యక్షురాలు ఫెర్నాండేజ్ డీ కిర్చనర్‌ హత్యా ప్రయత్నం జరిగింది.

ఈ ఘటనపై అర్జెంటినా దేశ అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండేజ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలో టీవీలో ప్రసారం అయింది. ఓ వ్యక్తి ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండేజ్ డీ కిర్చనర్ తలకు గన్ గురిపెట్టారని ఆయన వివరించారు. ఆ గన్ ట్రిగ్గర్ కూడా నొక్కారని, కానీ, ఆ గన్ నుంచి తూటా బయటకు రాలేదని తెలిపారు. అందుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు అని వివరించారు. క్రిస్టినా ఫెర్నాండేజ్ డీ కిర్చనర్ సజీవంగా ఉన్నారని చెప్పారు. ఆ గన్‌లో ఐదు బుల్లెట్లే లోడ్ చేసి ఉన్నాయని తెలిపారు. 

అర్జెంటినా తిరిగి ప్రజాస్వామిక పంథాను అనుసరించడం మొదలు పెట్టినప్పటి నుంచి చోటుచేసుకున్న దారుణమైన ఘటన ఇది అని వివరించారు.

ఫెర్నాండేజ్ డీ కిర్చనర్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఆమె విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, ఆమెకు సంఘీభావంగా మద్దతు దారులు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఆమె ఇంటి వద్ద ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రాంతంలోనే ఆమె కారు దిగి మద్దతుదారుల వద్దకు వెళ్తుండగా ఓ దుండగుడు గన్ తీసి ఆమె ముఖానికి కొన్ని అంగుళాల దూరంలో పెట్టి షూట్ చేశాడు. అదృష్టవశాత్తు ఆ గన్ పేలలేదు.

అధికారులు వెంటనే ఆ దుండగుడిని పట్టుకున్నారు. 35 ఏళ్ల ఆ దుండగుడు బ్రెజిల్ మూలాలు ఉన్నవాడిగా గుర్తించారు. 

ఫెర్నాండేజ్ డీ కిర్చనర్ 2007, 2015 మధ్య కాలంలో రెండు సార్లు దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2000 సంవత్సరానికి ముందు పబ్లిక్ కాంట్రాక్టులు ఇచ్చే వ్యవహారమై వచ్చిన ఆరోపణల మూలంా ఆమె 12 ఏళ్ల పాటు అనర్హత వేటుకు గురవ్వవచ్చు. ప్రజా కార్యాలయం నుంచి అనర్హరురాలిగా మిగిలిపోవచ్చు.

వచ్చే ఏడాది జరగనున్న జనరల్ ఎలక్షన్‌లో ఆమె అధ్యక్ష పదవి కోసం పోటీ పడవచ్చని చెబుతున్నారు.

ఆమెపై హత్యా ప్రయత్నం తర్వాత దేశ ఆర్థిక మంత్రి సెర్జియో మాస్సా ట్విట్టర్‌లో స్పందించారు. చర్చించడానికి బదులు ద్వేషం, హింస ఎప్పుడైతే పై చేయి సాధిస్తాయో.. సమాజాలు నాశనం అవుతాయని, ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని పేర్కొన్నారు.

ఈ ఘటనను చిలీ ప్రెసిడెంట్ గ్యాబ్రియెల్ బోరిక్, వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురో, పెరూ అధ్యక్షుడు పెడ్రో కాస్టిలో, బ్రెజిలియన్ అధ్యక్ష అభ్యర్థి లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాలు ఖండించారు. ఫెర్నాండేజ్ డీ కిర్చనర్‌కు సానుభూతి తెలిపారు. ప్రాణ హాని తప్పడంపై హర్షం వ్యక్తం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios