Asianet News TeluguAsianet News Telugu

Taliban: సంబురాలు చేసుకుంటూ గాల్లోకి కాల్పులు.. బుల్లెట్లు దిగి 17 మంది మృతి

పంజ్‌షిర్ లోయ కూడా తమ వశమైందన్న వార్తలతో కాబూల్‌లో తాలిబాన్లు పట్టలేని సంతోషంతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ బుల్లెట్లు ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న ఇంకొందరి బాడీల్లోకి దూసుకెళ్లాయి. కనీసం 17 మంది ఈ బుల్లెట్లు దిగి మరణించారు. మరో 40 మందికి బుల్లెట్ గాయాలైనట్టు తెలిసింది.
 

as panjshir fall news surfaces talibans went on celebratory mode and fired in air which killed atleast 17 people in kabul on friday
Author
New Delhi, First Published Sep 4, 2021, 7:36 PM IST

న్యూఢిల్లీ: అమెరికన్లు వదిలిన ఆయుధాలు, గత ప్రభుత్వ మిలిటరీకి చెందినవి, సొంతంగా అక్రమంగా కొనుగోలు చేసిన ఆయుధాలు పేలుడు సామగ్రితో తాలిబాన్లు అత్యంత ప్రమాకారులుగా మారారు. వారికిప్పుడు ఆయుధాల కొరత లేదు. ఒకరకంగా చెప్పాలంటే అవసరానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నాయి. బాంబులు, బుల్లెట్లు లెక్కచెప్పాల్సిన పనిలేదు. జవాబుదారీతనమూ లేదు. విచ్చలవిడి స్వేచ్ఛ వారి సొంతం. విషాద వార్తలైనా, సంతోషకర విషయమైనా చేతిలోని తుపాకుల ట్రిగ్గర్లు నొక్కడం వారికి పరిపాటిగా మారిపోయింది. తాజాగా కాబూల్‌లో ఓ సంతోషకర వార్త విని పులకించిన తాలిబాన్లు గాల్లోకి కాల్పులు కాల్చి వేడుక చేసుకోవాలని తుపాకుల ట్రిగ్గర్లు నొక్కారు. అది అనుకున్నట్టుగా సాగలేదు. అక్కడే ఉన్న కొందరి దేహాల్లోకి బుల్లెట్లు చీల్చుకెళ్లాయి. కనీసం 17 మంది మరణించారు. అంతేకాదు, కనీసం మరో 40 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి.

1996లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పడూ పంజ్‌షిర్ లోయ షేర్‌లాగా తలవంచలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ లోయ ఇంకా తాలిబాన్లకు సవాల్ విసురుతూనే ఉన్నది. తాలిబాన్ల పాలిట సింహస్వప్నంగా మారింది. యావత్ దేశాన్ని తమ గుప్పిట్లో బంధించుకున్నా పంజ్‌షిర్‌ను స్వాధీనం చేసుకోకపోవడం తాలిబాన్ల ఈగోను దెబ్బతీస్తూనే ఉన్నది. పంజ్‌షిర్‌ను లొంగదీసుకోవాల్సిందేనని తాలిబాన్లు బలంగా అనుకుంటున్నారు. ఇందుకోసం శాంతి చర్చలు చేశారు. విఫలం కావడంతో పెద్దమొత్తంలో ఆయుధ సామగ్రితో అక్కడికి తరలివెళ్లి తిరుగుబాటుదారులపై దాడి ముమ్మరం చేశారు. ఈ తరుణంలోనే పంజ్‌షిర్ కూడా తాలిబాన్ల వశమైందన్న వార్తలు వచ్చాయి. పంజ్‌షిర్ తమ పరమైందన్న వార్త తాలిబాన్లలో ఎంతో ఉత్తేజకరమైనది, ఉత్సాహాన్నిచ్చేదిగా మారింది. దీంతో కాబూల్‌లో కొందరు తాలిబాన్లు బుల్లెట్లు కాల్చి సంబురాలు చేసుకున్నారు. అయితే, ఆ బుల్లెట్లు ఇంకొందరికి శాపంగా మారాయి. శుక్రవారం సాయంత్రం ఆ తుపాకుల బుల్లెట్లు దిగి 17 మంది మరణించినట్టు సమాచారం. మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios