Maldives: ఇండియాను వ్యతిరేకిస్తే అంతే సంగతులు!.. మాల్దీవ్స్ అధ్యక్షుడిపై అభిశంసనకు విపక్షం నిర్ణయం
ఇండియా వ్యతిరేక వైఖరితో ఉంటే అంతే సంగతులు అన్నట్టుగా మాల్దీవుల్లో పరిస్థితులు మారాయి. చైనాకు అనుకూల విధానాలతో భారత్ పై విమర్శలు చేసి అధ్యక్షుడిగా ఎన్నికైన మొహమద్ ముయిజ్జుపై అభిశంసనకు ప్రతిపక్షం నిర్ణయం తీసుకుంది.
Maldives: చైనాకు అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జుపై అభిశంసనకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీకి మెజార్టీ ఉన్నది. అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జును తొలగించడానికి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ సంతకాల సేకరణ మొదలు పెట్టింది. చైనా నిఘా నౌకను అనుమతించడంతో మాల్దీవుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. చైనా నిఘా నౌక మాల్దీవుల తీరానికి వచ్చింది. ఇందుకు ముయిజ్జు ప్రభుత్వం అనుమతలు ఇచ్చింది.
నిన్ననే మాల్దీవుల పార్లమెంటులో రచ్చ జరిగిన సంగతి చూసి చాలా మంది నివ్వెరపోయారు. చట్టసభలో సభ్యులు ముష్టిఘాతాలకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. సభాపతిపైనా దాడి జరిగింది.
ముయిజ్జు ప్రభుత్వానికి ఆమోదం కోసం కీలకమైన పార్లమెంటరీ ఓటింగ్ ఆదివారం షెడ్యూల్ అయి ఉండింది. అధికార ఎంపీలే పార్లమెంటు కలాపాలను భంగపరిచారు. దీంతో పార్లమెంటులో హింస రేగింది. అధ్యక్షుడు మొహమద్ ముయిజ్జు పై అభిశంసన తీర్మానానికి ప్రతిపక్షం నిర్ణయం తీసుకుంది.
మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భారత్, చైనా పేర్లే ప్రధానంగా వినిపించాయి. ఓడిపోయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ భారత్ వైపు ఉండగా.. ముయిజ్జు పార్టీ మాత్రం చైనాకు అనుకూలంగా నినాదాలు చేసింది. చైనాకు అనుకూలంగానే ఉంటామని వైఖరి స్పష్టం చేసుకుంది. అతివాద, జాతీయవాద భావాలతో భారత్‌కు వ్యతిరేక నినాదాలు చేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ముయిజ్జునే అధికారంలోకి వచ్చారు. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. వెంటవెంటనే టర్కీకి, ఆ తర్వాత చైనాకు పర్యటించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. కొన్ని రోజులకు చైనా నుంచి నిఘా నౌక మాల్దీవుల వైపు బయల్దేరింది. ఈ నౌక పై చాలా అభ్యంతరాలు, ఆందోళనలు వెలువడ్డాయి.
Also Read: Janasena: జనసేన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్.. ‘ఇది సబబేనా?’
ఎన్నికల ప్రచారంలోనే మాల్దీవుల్లోని భారత ట్రూపులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత డెడ్ లైన్ కూడా పెట్టారు. ప్రధాని మోడీ లక్షదీవుల పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో భారత్ వైపు నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మాల్దీవుల్లోనూ వ్యతిరేకత వచ్చింది. దీంతో ముగ్గురు మంత్రులను ప్రభుత్వం బర్తరఫ్ చేసింది.
మాల్దీవులకు భారత్ ఎల్లప్పుడు తోడుగా నిలబడుతూ వచ్చింది. మాల్దీవుల్లో ఎలాంటి ప్రభుత్వం ఏర్పడినా భారత్‌తో సన్నిహిత సంబంధాలను నెరిపాయి. తొలిసారిగా ముయిజ్జు ప్రభుత్వం భారత్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసి అధికారంలోకి వచ్చింది. ఇది మాల్దీవుల్లో గతంలో లేని పరిణామం. భారత్ వ్యతిరేక వైఖరితో అధికారంలోకి వచ్చిన ముయిజ్జు అభిశంసనను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హం.