కాలిఫోర్నియాలో హిందూ ఆలయ గోడలపై భారత వ్యతిరేక, ఖలిస్థాన్ అనుకూల గ్రాఫిటీ
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రముఖ హిందూ దేవాలయమైన స్వామినారాయణ్ మందిర్ వాసన సంస్థ (Swaminarayan Mandir Vasana Sanstha) గోడలపై పై ఖలిస్థాన్ అనుకూల వ్యక్తులు ఆక్రోశాన్ని వెల్లగక్కారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో గ్రాఫిటీ చేశారు.
కాలిఫోర్నియాలోని నెవార్క్ లో ఓ హిందూ దేవాలయంపై విధ్వంసం జరిగింది. స్వామినారాయణ్ మందిర్ వాసన సంస్థ ఆలయ గోడలపై భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల నినాదాలతో గ్రాఫిటీ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను హిందూ అమెరికన్ ఫౌండేషన్ ‘ఎక్స్’ హ్యాండిల్ లో షేర్ చేసింది.
‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. ఆలయ గోడపై భారత్ కు, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విద్వేషపూరిత నినాదాలు రాశారు. ఆలయాన్ని సందర్శించే ప్రజలను బాధకు గురి చేసేందుకు, హింసా భయాన్ని సృష్టించడానికి విద్వేషపూరిత సందేశాలను రాసి ఉండవచ్చని హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది. కాగా.. ఈ ఘటనపై నెవార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్, డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ సివిల్ రైట్స్ విభాగంలో కేసు నమోదైంది.
గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి సమీపంలో నివసిస్తున్న ఒక భక్తుడు భవనం బయటి గోడపై నల్ల సిరాలో హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక గ్రాఫిటీని గుర్తించాడని, వెంటనే స్థానిక యంత్రాంగానికి సమాచారం అందించామని ఆలయ పరిపాలన ప్రతినిధి భార్గవ్ రావల్ ‘ఏఎన్ఐ’కి తెలిపారు. ఈ ఘటనపై నెవార్క్ నగరానికి చెందిన పోలీసు కెప్టెన్ జొనాథన్ అర్గెల్లో మాట్లాడుతూ.. గ్రాఫిటీ ఆధారంగా ఇది లక్షిత చర్యగా భావిస్తున్నామని, దీనిపై పూర్తి లోతుగా దర్యాప్తు చేస్తామని చెప్పారు.
‘‘నెవార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్, నెవార్క్ కమ్యూనిటీలో ఒక సభ్యుడిగా ఈ రకమైన చర్యలు జరిగినప్పుడు మేము చాలా విచారిస్తున్నాం. అవి తెలివితక్కువవి. ఇలాంటి వాటిని మేము ఇక్కడ సహించం. కాబట్టి ఈ ఘటనను మేము తీవ్రంగా పరిగణిస్తాం. దీనిని లోతుగా దర్యాప్తు చేస్తాం’’అని పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారులు సాక్ష్యాధారాల సేకరణ ద్వారా దీనిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వికృత చేష్టలకు దారితీసిన ఘటనల గొలుసును గుర్తించడానికి, చుట్టుపక్కల నివాసాల్లోని నిఘా కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
కాగా.. హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అమెరికా దాని పొరుగున ఉన్న కెనడాలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. పెరుగుతున్న ఖలిస్తాన్ మద్దతుదారుల కార్యకలాపాలు, వివిధ దేశాల్లో వేర్పాటువాద భావాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించడంపై భారత్ ఇదివరకే ఆందోళన వ్యక్తం చేసింది. ఆగస్టులో కెనడాలోని సర్రేలో ఓ ఆలయాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. బ్రిటిష్ కొలంబియాలోని పురాతన దేవాలయాలలో ఒకటైన సర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్ గోడలు, గేటుపై ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు అతికించారు.