Asianet News TeluguAsianet News Telugu

ఈజిప్టు రహస్యం.. టుటంఖమన్ సమాధిలో మరో సీక్రెట్.. రాణి నెఫెర్టిటి సమాధి వివరాలు వెలుగులోకి..!

ఈజిప్టులోని టుంటఖమన్ సమాధిలో మరో సీక్రెట్ బయటపడింది. ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్త ఆర్కియాలజిస్టుల అన్వేషణకు పరిష్కారం లభించిందని బ్రిటీష్ ఈజిప్టాలజిస్టు వివరించారు. టుటంఖమన్ కంటే ముందు పాలించిన క్వీన్ నెఫెర్టిటీ సమాధి లొకేషన్ వివరాలు టుటంఖమన్ సమాధిలోనే ఉన్నాయని తెలిపారు. నెఫెర్టిటీ సమాధి పెద్దదాని, దాని వెలుపలి చిన్న భాగమే టుటంఖమన్ సమాధి అని వివరించారు.

another egypt secret revealed in Tutankhamun tombo.. location of queen nefertiti
Author
First Published Sep 26, 2022, 4:25 PM IST

న్యూఢిల్లీ: ప్రాచీన నాగరికతలపై ఆసక్తికలవారు తప్పకుండా ఈజిప్టు గురించి చదివే ఉంటారు. నైలు నదీ తీరంలో విలసిల్లిన ఈజిప్టు నాగరికతపై మనసుపారేసుకోకుండా ఉండలేరు. భారీ నిర్మాణాలు పిరమిడ్లు, అందులోని ఫారోల సమాధులు, ఫారోల మమ్మీల గురించి తెలుసుకోవడానికి ఇప్పటికీ ఆసక్తి చూపుతారు. అందులోనూ చిన్న వయసులోనే మరణించిన టుటంఖమన్ అంటే.. చాలా మందికి తెలిసే ఉంటుంది. టుటంఖమన్ చుట్టూ అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన సమాధి ముట్టుకోవడానికి కూడా కొన్ని సంవత్సరాలు జంకారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన సమాధిని కనుగొన్నవారూ విచిత్ర పరిస్థితుల్లో మరణించడం ఈ ఊహాగానాలను మరింత పెంచాయి. తాజాగా, అదే టుటంఖమన్ సమాధి మరో సీక్రెట్‌ను బయటకు తెచ్చింది. 

ఈజిప్టు నాగరికతపై ఆసక్తి ఉన్నవారందరికీ టుటంఖమన్ కంటే ముందు పాలించిన ఆయన సవతి తల్లి నెఫెర్టిటి సమాధి గురించి నెలకొని ఉన్న ఆసక్తి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఆమె సమాధిని కనుగొనడానికి ఎన్నో మమ్మీలతో డీఎన్ఏ టెస్టులు చేశారు. మరెన్నో చోట్లా నెఫెర్టిటి సమాధి గురించి పరిశోధనలు చేశారు. కానీ, ఆమె సమాధి ఇప్పటి వరకూ కనుగొనబడలేదు. అయితే, బ్రిటీష్‌ ఈజిప్టాలజిస్ట్ నికోలస్ రీవ్స్ తాజాగా సరికొత్త వాదన తెచ్చారు. నెఫెర్టిటి సమాధి లొకేషన్ వివరాలు టుటంఖమన్ సమాధిలోనే దాగి ఉన్నాయని వివరించారు.

టుటంఖమన్ సమాధి పక్కనే రహస్య చాంబర్‌లో నెఫెర్టిటి సమాధి ఉండవచ్చని చాలా కాలం నుంచి కొన్ని వాదనలు ఉన్నాయి. ఈ వాదనలను బలపరిచేలాగే బ్రిటీష్ నిపుణుడు పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

టుటంఖమన్ సమాధిని వందేళ్ల క్రితం అంటే 1922లో కనుగొన్నారు. టుటంఖమన్‌ను ఆయన తర్వాతి పాలకుడు ఫారో అయ్ సమాధి చేశాడు. ఇందుకు సంబంధించిన చిత్రాల కింద మరికొన్ని చిత్రాలు ఉన్నాయని బ్రిటీష్ ఈజిప్టాలజిస్టు వివరించారు. టుటంఖమన్‌ను సమాధి చేస్తున్నట్టు వివరిస్తున్న చిత్రాల కింద.. నెఫెర్టిటిని టుటంఖమన్ సమాధి చేస్తున్న చిత్రాలు ఉన్నాయని వివరించారు. ఆ తర్వాతి చిత్రాలు మమ్మీ నోరు తెరిచే కార్యక్రమం గురించి వివరిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఐదు సెన్స్‌లను పునరుద్ధరించవచ్చని వారు భావించారు. 

ఫారో అయ్ సమాధికి చేసిన డిజైన్‌ల కింద టుటంఖమన్ గురించిన వివరాలే ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందులోనే నెఫెర్టిటి సమాధి వివరాలు దాగి ఉన్నాయని పేర్కొన్న కథనం ఇంగ్లాండ్ పత్రిక ది గార్డియన్‌లో అచ్చయింది.

నెఫెర్టిటి.. అఖెనటెన్ ప్రిన్సిపల్ వైఫ్. టుటంఖమన్‌కు సవతి తల్లి. ఆమె సమాధి ప్రపంచవ్యాప్త ఆర్కియాలజిస్టులకు ఎక్కడా కనిపించలేదు. ఫారో అయ్ సమాధిపై చిత్రీకరణలను దగ్గరగా పరిశీలిస్తే.. వాటి కింద ఆ సమాధి ఒరిజినల్ ఓనర్ (నెఫెర్టిటి) అంత్యక్రియలకు సంబంధించినవి కనిపిస్తాయని వివరించారు.

టుటంఖమన్ సమాధిలో కుర్చీలు, రథాలు, ఖజానాలు, ఇతర విలాస వస్తువులు ఉంచారు. ఆయన ఆకస్మికంగా 19 ఏళ్లకు మరణించారు. నెఫెర్టిటిదే పెద్ద సమాధి అని, ఆ సమాధి వెలుపలి భాగమే టుటంఖమన్ సమాధి అని ఆ బ్రిటీష్ నిపుణుడు చెప్పారు. ఆసక్తి కొద్దీ ఎన్నో రాతలు రాయవచ్చు.. కానీ, సమాధి చాంబర్‌లోని డెకరేషన్ గోడపై మార్పులు జరిగాయని కనుగొన్నాను కాబట్టే ఈ వాదన చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. తొలుత టుటంఖమన్ సమాధిని కనుగొన్నప్పుడు కూడా ఒక రాజు సమాధి ఇంత చిన్నదిగా ఉంటుందా? అని నమ్మశక్యం కాలేదని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios