టర్కీని మరోసారి వణికించిన భూకంపం.. ఇప్పటికే టర్కీ, సిరియాల్లో 1,300 దాటిన మృతుల సంఖ్య..
టర్కీలో మరోసారి భూకంపం వణికించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రెండోసారి సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదైంది.

టర్కీలో మరోసారి భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో రెండు దేశాలలో కలిపి 1,300 మందికి పైగా మరణించారు. అయితే టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం రెండోసారి సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.5గా నమోదైంది. రెండో భూకంపం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:24 గంటలకు ఎకినోజు పట్టణానికి దక్షిణ-ఆగ్నేయంగా 4 కి.మీ దూరంలో సంభవించింది. తాజా భూకంపం డమాస్కస్, లటాకియా, ఇతర సిరియన్ ప్రావిన్సులను వణికించింది. రెండో భూకంపంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక, తొలుత సంభవించిన భూకంపంతో టర్కీ, సిరియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు రెండు మిలియన్ల మంది ప్రజలు నివసించే టర్కీ నగరమైన గాజియాంటెప్‌కు సమీపంలో 17.9 కిలోమీటర్ల (11 మైళ్లు) లోతులో తెల్లవారుజామున 04:17 గంటలకు సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.రెండు దేశాల్లోని చాలా చోట్ల భవనాలు ధ్వంసం అయ్యాయి. టర్కీలో 912 మంది మృతిచెందినట్టుగా ఆ దేశ అధికారులు ప్రకటించారు. 5 వేల మందికి పైగా గాయపడగా.. 2,818 బిల్డింగ్స్ కూలిపోయాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఏడుస్తున్న పిల్లలు, కూలిన భవనాలు, మృతదేహాలతో నిండిన ఆసుపత్రులు, ప్రజలు భయంతో వణకడం కనిపిస్తున్నాయి. ఇక, ఈ భూకంపాన్ని ఈ శతాబ్దంలో టర్కీని తాకిన అత్యంత ఘోరమైనదిగా చెబుతున్నారు. ఇక, భూకంపం కారణంగా సిరియాలోని ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో కనీసం 326 మంది మరణించినట్టుగా తాజా నివేదికలు పేర్కొన్నాయి. ఇక, భూకంపం కారణంగా రెండు దేశాల్లో కలిపి 1,300 మందికి పైగా మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సహాయక చర్యలు సాగుతున్న సమయంలోనే మరోసారి టర్కీలో భూకంపం చోటుచేసుకుంది.