Asianet News TeluguAsianet News Telugu

బంగ్లాదేశ్‌లో మరో హిందూ దేవాలయంపై దాడి.. దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు మైనారిటీల పిలుపు

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా, శనివారం మరోసారి ఫెనీలోని ఆలయంపై దాడి జరిగింది. ఈ ఘటనపై తీవ్ర ఎత్తున నిరసన వెలువడుతున్నది. ఈ దాడులకు వ్యతిరేకంగా మైనార్టీలు దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
 

another attack on a hindu temple in bangladesh
Author
Dhaka, First Published Oct 17, 2021, 5:08 PM IST

ఢాకా: Bangladeshలో హిందూ దేవాలయాలపై కొందరు మతోన్మాదుల దాడులు ఆగడం లేదు. దుర్గా పూజా వేడుకలపై జరిగిన దాడులపై తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. భారత్‌లోనూ ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో దోషులను కఠినంగా శిక్షించాలని బంగ్లాదేశ్‌కు భారత్ సూచించింది. దీనిపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా సానుకూలంగా స్పందించారు. అయినప్పటికీ ఈ దాడులు కొనసాగుతుండటం మరింత ఆందోళనను కలిగిస్తున్నది. తాజాగా, దేశరాజధాని ఢాకాకు 157 కిలోమీటర్ల దూరంలోని ఫెనిలో Hindu Temples, హిందువుల ఆస్తులపై శనివారం దాడులు జరిగాయి. దుర్గా మండపాలపై జరిగిన దాడులను నిరసించిన ఆందోళనకారులపై ఆ మూక దాడి చేసి అనంతరం ఆలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఈ ఘటనలో ఫెని మాడల్ పోలీసు స్టేషన్ ఇన్‌చార్జీ నిజాముద్దీన్ సహా సుమారు 40 మంది గాయపడినట్టు సమాచారం.

శనివారం సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతం నుంచి కొందరు ఉన్మాదులు ఫెని ఏరియాలోని హిందువుల ఆస్తులపై దాడులు చేశారు. హిందు ఆలయాలపైనా దాడి చేశారు. ఈ విషయం తెలియగానే వెంటనే అదనపు పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని మోహరించారు. ఈ దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగినట్టు తెలుస్తున్నది. మున్షిగంజ్‌ సిరాజ్‌దిఖాన్ ఉపజిలాలోని దనియాపర మహా శోషణ్ కాళీ మందిర్‌లో దాడులు జరిగాయి. ఈ ఆలయంలో శనివారం కనీసం ఆరు విగ్రహాలను ధ్వంసం చేసినట్టు సమాచారం. హిందు ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉండటంతో దేశంలోని మైనార్టీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: హిందూ ఆలయాలపై దాడి చేసిన వారిని పట్టుకుని తీరుతాం.. కఠినంగా శిక్షిస్తాం: ప్రధాని

చిట్టాగాంగ్‌లోని హిందు, బుద్దిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఈ దాడులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. దుర్గా వేడుకలపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి నిరాహార దీక్షకు కూర్చుంటామని పిలుపునిచ్చింది. ఈ ప్రకటనకు ముందు ఆరు గంటలపాటు చిట్టాగాంగ్‌లో ధర్నా చేసింది. 

హిందు ఆలయాలపై దాడులు చేస్తున్నవారిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని కౌన్సిల్ అధ్యక్షుడు మిలాన్ కాంతి దత్తా హెచ్చరించారు. ఈ దేశ హోం మంత్రి మొదలు రూలింగ్ పార్టీ జనరల్ సెక్రెటరీ వరకూ అందరు తమకు సానుకూలంగా మద్దతు ఇస్తున్నారని వివరించారు. వారందరూ ఘటన గురించిన వివరాలను తాము పరిశీలిస్తున్నామని చెప్పారని గుర్తుచేశారు. అయితే, అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా వీళ్లు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios