ఆ షూటర్ ఇతడే.. మృతులను గుర్తించిన పోలీసులు

Annapolis Shooting Suspect Name Revealed
Highlights

ఆ షూటర్ ఇతడే.. మృతులను గుర్తించిన పోలీసులు

మేరీల్యాండ్‌లోని అన్నాపోలీస్‌లో 'క్యాపిటల్ గెజిట్' వార్తాపత్రిక కార్యాలయంపై జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడిని అమెరికా పోలీసులు గుర్తించారు. మేరీల్యాండ్‌లోని లారెల్‌కు చెందిన 'జోర్డాన్ రామోస్' అనే 38 ఏళ్ల వ్యక్తి ఈ కిరాతకానికి పాల్పడినట్లు పోలీసులు మీడియాకి వెల్లడించారు.

జోర్డాన్ రామోస్ షాట్‌గన్, స్మోక్ గ్రెనేడ్ లేదా ఫ్లాష్-బ్యాంగ్ గ్రెనేడ్‌లతో ఈ దాడికి దిగినట్లు పోలీసులు చెప్పారు. పత్రికా కార్యాలయం లోపలికి కిటికీ అద్దాల గుండా కాల్పులు జరపడంతో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారని వివరించారు.

కాగా.. ఈ షూటింగ్‌లో మరణించిన వారిని పోలీసులు గుర్తించారు. వారి వివరాలివి:

1. వెండీ వింటర్స్, 65 ఏళ్లు, రిపోర్టర్
2. రెబెకా స్మిత్, 34 ఏళ్లు, సేల్స్ అసిస్టెంట్
3. రాబర్ట్ హియాసెన్, 59 ఏళ్లు, ఎడిటర్
4. గెరాల్డ్ విష్‍మాన్, 61 ఏళ్లు, ఎడిటోరియల్ రచయిత
5. జాన్ మెక్‌నమారా, 56 ఏళ్లు, రిపోర్టర్, ఎడిటర్

కాల్పులు ఎందుకు జరిపాడు?
మేరీల్యాండ్‌లోని లారెల్ లొకేషన్ ద్వారా రామోస్ పేరుతో ఆపరేట్ చేయబడుతున్న ట్విట్టర్ ఖాతాను పోలీసులు గుర్తించారు. ఈ ట్విట్టర్ అకౌంట్ నుండి క్యాపిటల్ గెజిట్‌కు వ్యతిరేఖంగా కొన్ని ఏళ్ల తరబడి అనేక పోస్టులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక కథనాల ప్రకారం, 2011లో రామోస్ ఓ క్రిమినల్ హెరాస్‌మెంట్ కేసులో మేరీల్యాండ్ కోర్టులో తప్పు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఐదు రోజులకు ది క్యాపిటల్ (క్యాపిటల్ గెజిట్ అనుబంధ సంస్థ)లో రామోస్ ఓ మహిళను ఆన్‌లైన్ ద్వారా హింసించాడంటూ ఓ కథనం వచ్చింది. ఆ తర్వాతి నుండి రామోస్ క్యాపిటల్ గెజిట్ సంస్థపై ద్వేషం పెంచుకున్నాడని, ఆ వ్యక్తిగత కక్ష కారణంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు.
 

loader