ఈ దాడి ప్రతి అమెరికన్ పైనా జరిగిన దాడి: వైట్‌హౌస్

Annapolis shooting is 'senseless violence': White House
Highlights

అమెరికాలోని మేరీల్యాండ్‌లో అన్నాపోలీస్ వద్ద ఉన్న క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రిక కార్యాలయంపై జరిగిన కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది.

అమెరికాలోని మేరీల్యాండ్‌లో అన్నాపోలీస్ వద్ద ఉన్న క్యాపిటల్ గెజిట్ వార్తాపత్రిక కార్యాలయంపై జరిగిన కాల్పుల ఘటనను అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ఈ విషాద ఘటనపై వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ శారా సాండర్స్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు తమ బాధ్యతను తాము నిర్వహిస్తున్నారని, వారిపై దాడిచేయడమంటే ప్రతి అమెరికన్‌పైనా దాడి చేసినట్లేనని వ్యాఖ్యానించారు.

ఈ విషయంపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'అన్నాపోలీస్‌లో జరిగిన కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. తమ బాధ్యతలు నిర్వహిస్తున్న అమాయక జర్నలిస్టులపై హింసాత్మకంగా దాడికి పాల్పడడం అవివేకం. ఇది అమెరికాలోని ప్రజలందరిపైనా జరిగిన దాడి. బాధితులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం మేము ప్రార్థిస్తున్నామ'ని అన్నారు.

ఈ విషయంపై ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా.. అమెరికా ప్రథమ మహిళ, డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ కూడా ఈ ఘటనపై స్పందించారు. క్యాపిటల్ గెజిట్‌పై జరిగిన దాడి 'క్రూరమైన హింస' అని వ్యాఖ్యానించారు.

గురువారం మద్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న క్యాపిటల్ గెజిట్ న్యూస్‌రూమ్‌లోకి గుర్తు తెలియని సాయుధ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు దిగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందగా, 10 మందికి పైగా గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

loader