తల్లి మద్యం పిచ్చి.. అభం, శుభం తెలియని పసికందు ప్రాణం తీసింది. ఆమె మద్యం తాగి.. బిడ్డకు పాలివ్వడంతో... ఆ పసికందు ప్రాణాలు వదిలింది. ఈ దారుణ సంఘటన మేరీల్యాండ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మేరీ ల్యాండ్‌కు చెందిన మురియెల్ మోరిసన్ అనే మహిళ వర్చువల్‌ పార్టీలో 2 బీర్‌లు, కొంచెం మద్యం సేవించింది. తరువాత వెళ్లి తన నాలుగేళ్ల  చిన్నారితో పాటు నిదురిస్తున్న మరో పాప వద్ద పడుకుంది. అంతకముందు తన చిన్నారికి పాలు ఇచ్చింది. ఉదయం లేచే సరికి.. ఆ పసిబిడ్డ చనిపోయి కనిపించింది. ఆ చిన్నారి పెదాలు రంగు మారడం గమనార్హం.  అయితే బీర్‌ వాసన వలన ఆ పసికందు మరణించిందని, ఆ తల్లి మద్యం సేవించడం కారణంగా పాపకు ఊపిరాడక మృతి చెందినట్లు ఆమె పై కేసు నమోదయ్యింది. ఆమె మద్యం సేవించి బిడ్డకు పాలు ఇవ్వడం కూడా ఒక కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 

అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం తల్లి నిర్లక్ష్యం కారణంగా బిడ్డ చనిపోయిందనడానికి ఏం ఆధారాలు లేవని పేర్కొంది. అంతే కాకుండా బీర్‌ వాసన వల్ల ఊపిరాడక మరణిస్తారు అని ఎక్కడ లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో మోరిసన్‌ను విడుదల  చేశారు. అమెరికాలో ఈ ఒక్కటే కాదు ప్రతి యేడాది కలిసి పడుకోవడం వలన 3,500 మందికి పైగా చిన్నారులు మరణిస్తున్నారు. చిన్నారులతో కలిసి పడుకోవడం కాకుండా వారికి వేరే  ఊయల లేదా బెడ్‌ను ఏర్పాటు చేయాలని అమెరికా ఆరోగ్య భద్రత నిపుణులు సూచిస్తున్నారు. కానీ 64 శాతం మందికి పైగా మహిళలు వారి పిల్లలతో కలిసి ఒకే బెడ్‌ పై నిదురిస్తున్నారని తేలడం గమనార్హం.