యూకేలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ నిప్పు రవ్వతో లండన్‌లో ట్రైన్ ట్రాక్‌పై ఉన్న కలప దుంగలు మండిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

న్యూఢిల్లీ: యూకేలో భానుడి తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక్కడ త్వరలోనే 34 డిగ్రీల సల్సియస్‌లకు ఉష్ణోగ్రతలు చేరేలా ఉన్నట్టు బీబీసీ పేర్కొంది. ఎండ కారణంగా అనేక ఆటంకాలు కలుగొచ్చని ప్రజలకు మెట్ ఆఫీస్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంగ్లాండ్‌లోని చాలా ప్రాంతాల్లో లెవెల్ త్రీ హీట్ హెల్త్ అలర్ట్ జారీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో లండన్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. లండన్‌లోని బ్రిడ్జీపై జులై 11వ తేదీన ట్రాక్స్‌పై మంటలు వచ్చాయి. చిన్ని అగ్గి మిణుగురుతో ట్రాక్‌లపై ఉన్న చెక్క దుంగలు అంటుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

వాండ్స్‌వర్త్ రోడ్, లండన్ విక్టోరియాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. సౌత్ ఈస్ట్రన్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్ స్టీవ్ వైట్ ఈ ఘటనను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ట్రాక్‌లపై నిప్పు అంటుకున్న దృశ్యాలను ఆయన పోస్టు చేశారు. ఈ ఘటనపై సకాలంలో స్పందించిన రైల్ కంపెనీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. లండన్ ఫైర్ బ్రిగేడ్ కూడా స్వల్ప కాలంలోనే అప్రమత్తమైందని వివరించారు. వచ్చే వారాల్లో ఉష్ణోగ్రతలు మరింత కఠిన సవాళ్లను విసిరే ముప్పు ఉన్నదని నెట్వర్క్ రైల్ సౌత్ ఈస్ట్‌కు ఈ పోస్టుకు స్పందనగా పేర్కొంది.

Scroll to load tweet…

మరో పోస్టులో ఈ సంస్థ నిప్పు ఎలా అంటుకున్నదో వివరించే ప్రయత్నం చేసింది. ట్రాక్‌లపై ఉన్న చెక్క దుంగలు ఎండిపోయి ఉన్నాయని పేర్కొంది. వాటికే నిప్పు అంటుకున్నట్టు వివరించింది. అయితే, ఆ దుంగలకు ఎలా నిప్పు అంటుకున్నదన్న విషయంపై తమకూ స్పష్టత లేదని, బహుశా బయటి నుంచి వచ్చిన అగ్ని మిణుగురులు ఈ మంటలను కలుగ చేసి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఈ ఘటనపై ఇన్‌స్పెక్షన్ పాస్ చేసినట్టు వివరించింది. ఈ ఘటన కారణంగా ఆ దుంగలను అలాగే వినియోగించవచ్చునా? లేక మార్చాలా? అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.