పాకిస్తాన్‌ను ఒక అద్దె తుపాకీగా అమెరికా వాడుకున్నదని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా ఉగ్రవాదులపై చేస్తున్న యుద్ధంగా ప్రకటించిన పోరాటం పాకిస్తాన్‌ను కష్టాల్లోకి నెట్టేసిందని అన్నారు.

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాపై సంచలన ఆరోపణలు చేశాడు. అమెరికా చేసిన ఉగ్రవాదంపై యుద్దం తమ దేశానికి సంకటంగా మారిందని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అది చేసిన 20 ఏళ్ల యుద్ధంలో పాకిస్తాన్‌ను అద్దెకు తీసుకున్న తుపాకీగా వాడుకున్నదని ఆరోపించారు. సీఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా గెలవడానికే తాము మద్దతునిచ్చామని తెలిపారు.

పాకిస్తాన్‌పై అమెరికా రక్షణ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఈ విధంగా మాట్లాడారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరణ పూర్తయిన నేపథ్యంలో పాకిస్తాన్‌తో తమ దేశ సంబంధాలను సమీక్షించుకోవాల్సి ఉన్నదని అన్నారు. పాకిస్తాన్ ఆశిస్తున్న కొన్ని ప్రయోజనాలు తమ లక్ష్యాలకు విరుద్ధంగా ఉన్నాయని వివరించారు. పాకిస్తాన్‌కు తాలిబాన్లతోపాటు ఇతర ఉగ్రవాద సంస్థలతోనూ బలమైన సంబంధాలున్నట్టు ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారిందని వాదనలున్నాయి. కానీ, వాటిని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు.

‘స్వర్గధామాలంటే ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరహద్దులో అమెరికా డ్రోన్‌లతో పటిష్ట నిఘా ఉన్నది. అలాంటప్పుడు వారికే ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇక్కడ ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారా? అనేది వారికే తెలియాలి.’ అని అన్నారు. అంతేకాదు, తాలిబాన్ ప్రభుత్వానికి మద్దతుగానూ మాట్లాడారు.

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వంపై అంతర్జాతీయ సమాజం వేగంగా తమ వైఖరులు వెల్లడించి, అంతర్జాతీయ గుర్తింపునకు సహకరించాలని ఇమ్రాన్ ఖాన్ సూచించారు. మహిళల హక్కులు, సంఘటిత ప్రభుత్వంపై తాలిబాన్లను ప్రోత్సహించాలని తెలిపారు. యావత్ ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబాన్ల నియంత్రణలో ఉన్నదని, అన్నివర్గాలను ఏకతాటి మీదకు తెస్తే అక్కడ మరో 40 ఏళ్లలో శాంతి వర్ధిల్లుతుందని, లేదంటే ఎప్పటికీ అల్లర్ల వంటి పరిస్థితులే ఉంటాయని అభిప్రాయపడ్డారు. తద్వార అతిపెద్ద మానవ సంక్షోభం, శరణార్థి సమస్యగా మారుతుందని తెలిపారు.