ఇజ్రాయెల్ కు అండగా అమెరికా.. యుద్ధనౌకలు, విమానాలు పంపించిన అగ్రరాజ్యం.. వ్యతిరేకించిన హమాస్
హమాస్ దళాలపై తిరగబడుతున్న ఇజ్రాయెల్ దళాలకు మరింత సాయం చేసేందుకు అమెరికా ముందుకు వచ్చింది. ఆ దేశానికి యుద్ధ నౌకలు, విమానాలు పంపించింది. అయితే దీనిని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆకస్మిక దాడులపై ఇజ్రాయెల్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. ఈ దాడికి ఆ దేశం ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధపడింది. తాము కూడా యుద్ధానికి సిద్దమే అంటూ ప్రకంటించింది. బాధిత దేశానికి పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే భారత్, అమెరికా తమ మద్దతును ప్రకటించాయి. పాలస్తీనా దాడిని ఖండించాయి.
అయితే తాజాగా అమెరికా ఇజ్రాయెల్ కు మరింత అండగా నిలబడింది. బాధిత దేశానికి సాయం చేసేందుకు యుద్ధ నౌకలు, విమానాలను పంపించింది. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలతో విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, దాని వెంట ఉన్న యుద్ధనౌకలను తూర్పు మధ్యధరా ప్రాంతానికి పంపుతున్నామని అమెరికా డిఫెన్స్ విభాగం ‘పెంటగాన్’ తెలిపింది. నౌకలు, విమానాలు తమ కొత్త స్థావరాలకు కదలడం ప్రారంభించాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం మధ్యాహ్నం ధృవీకరించింది.
కాగా.. ఇజ్రాయెల్ పై హమాస్ దళాలు జరిపిన హింసలో అనేక మంది అమెరికా దళాలు మరణించారని వైట్ హౌస్ ప్రకటించింది. దీంతో అమెరికా బాధిత దేశానికి వేగంగా మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఘర్షణ నుండి దూరంగా ఉండాలని ఇతర పార్టీలను హెచ్చరించింది. బైడెన్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారని వైట్ హౌస్ పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు యుద్ధనౌకలు, విమానాలు పంపిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరింత సాయం చేస్తామని చెప్పారని తెలిపింది.
ఇజ్రాయెల్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి వల్ల శత్రువులూ ఎవరూ లాభం పొందకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఇరువురు నాయకులు చర్చించారు. హమాస్ తీవ్రవాదుల అపూర్వ, భయంకరమైన దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి, ప్రజలకు తన పూర్తి మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు హామీ ఇచ్చారు.
కాగా.. అమెరికా సాయాన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇజ్రాయెల్ కు ఆయుధాలను సరఫరా చేసేందుకు అమెరికా విమానాలు, నౌకలను పంపించి, తమ ప్రజలపై దురాక్రమణలో భాగస్వామ్యం వహించిందని హమాస్ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ వల్ల ఇప్పటి వరకు 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 400 మందికి పైగా మరణించినట్లు గాజా అధికారులు నివేదించారు.