పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం సాయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆ దేశానికి అమెరికా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సర్జికల్ స్ట్రైక్స్ విషయంపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసేలా సైనిక చర్యకు దిగరాదని, పాక్ భూభాగంలోని ఉగ్రవాద గ్రూపులపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీతో మాట్లాడినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు.

అలాగే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కూడా మాట్లాడానని, రక్షణపరమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే... ఉపఖండంలో శాంతిభద్రతలను కాపాడాలన్న ఉమ్మడి లక్ష్యం గురించి తాము చర్చించామని ఆయన పాంపియో తెలిపారు.

ఇరు దేశాలు సంయమనంతో వ్యవహరించాలని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మరింతగా ఉద్రిక్తతలు పెంచే విధంగా వ్యవహరించవద్దని, సైనిక చర్యలకు పాల్పడకుండా చర్చలకు ముందుకురావాలని ఆయన సూచించారు.