ఆగస్టు 31లోపు అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి కావాలని తాలిబాన్లు హెచ్చరించారు. లేదంటే తదుపరి పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. అమెరికా పౌరులందరినీ స్వదేశానికి తరలించే వరకు బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఉంటాయని, ఉపసంహరణ ప్రక్రియ 31వ తేదీని దాటొచ్చని అమెరికా అద్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన తర్వాత తాలిబాన్ల హెచ్చరిక రావడం గమనార్హం. తాలిబాన్ వార్నింగ్‌పై యూఎస్ స్పందించాల్సి ఉంది.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలిబాన్లు ప్రభుత్వ ఏర్పాట్ల కోసం కసరత్తులు మొదలుపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ దేశంలోనే గవర్నర్లు, ఇతర నేతలు తాలిబాన్లకు లొంగిపోయారు లేదా అజ్ఞాతంలోకి వెళ్లారు. కాబూల్‌లోకి తాలిబాన్లు ప్రవేశించగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. తాలిబాన్ల అగ్రనాయకత్వం కాబూల్‌ చేరుకున్నారు. అయితే, ఒప్పందం ప్రకారం, అమెరికా బలగాలు దేశం వీడిన తర్వాతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాలిబాన్లు భావిస్తున్నట్టు తెలిసింది.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడానికి దోహాలో జరిగిన ఒప్పందం కీలకమైంది. ఆ దోహా చర్చల తర్వాతే అమెరికా బలగాల ఉపసంహరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆగస్టు 31లోపు తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. ఇదే నిబంధనకు అమెరికా, తాలిబాన్లు కట్టుబడి ఉన్నారు. కానీ, ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న తమ పౌరులను స్వదేశానికి తరలించడం అనుకున్నంత సులువుగా ముగియడం లేదు. గడువు మించిపోయేలా ఉన్నది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగస్టు 31వ తేదీ తర్వాత కూడా బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండే అవసరం పడొచ్చని అభిప్రాయపడ్డారు. తమ పౌరులందరినీ అమెరికాకు తరలించే వరకూ యూఎస్ బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లోనే ఉంటాయని స్పష్టం చేశారు.

ఈ ప్రకటన తాలిబాన్లకు రుచించడం లేదు. ఆగస్టు 31వ తేదీ తర్వాత అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండరాదని అంటున్నారు. 31లోపు యూఎస్ బలగాల ఉపసంహరణ పూర్తవ్వాల్సిందేనని కరాఖండిగా చెబుతున్నారు. ఆగస్టు 31వ తేదీనే రెడ్‌లైన్‌గా తాలిబాన్లు ప్రకటించారు. లేదంటే తదుపరి పరిణామాలను అమెరికా ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ హెచ్చరికపై అమెరికా స్పందించాల్సి ఉన్నది.