కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలమౌతున్నాయి. దీనికి మందు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు శాయశక్తులా శ్రమిస్తున్నారు.ఇలాంటి సమయంలో.. ఓ డాక్టర్ చాలా విచిత్రమైన కామెంట్స్ చేశారు. అసలు మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదని.. కరోనాకి మందు ఉందంటూ పేర్కొన్నారు. కాగా.. ఆ డాక్టర్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

‘‘ఎవరూ అనారోగ్యం బారిన పడే అవకాశం లేదు. కరోనా వైరస్‌కు మందుకు ఉంది. అది మరేదో కాదు హైడ్రాక్సీక్లోరోక్విన్. కాబట్టి మాస్కులు ధరించాల్సిన పనిలేదు. అలాగే లాక్‌డౌన్‌ కూడా కొనసాగించాల్సిన పనిలేదు‌’’అంటూ హూస్టన్‌కు చెందిన ఫిజీషియన్‌ స్టెల్లా ఇమాన్యుయేల్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

 ‘అమెరికన్‌ ఫ్రంట్‌లైన్‌ డాక్టర్స్‌’ పేరిట ఏర్పడిన ఓ గ్రూప్‌లో యాంటీ మలేరియా డ్రగ్‌ హెచ్‌సీక్యూ గురించి ప్రమోట్‌ చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. దీనిని రీట్వీట్‌ చేయడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ చిక్కుల్లో పడ్డారు.

 కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో "తప్పుదోవ పట్టించే , హానికరమైన సమాచారాన్ని" పోస్ట్‌ చేశారంటూ ట్విటర్‌ ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో స్టెల్లా సోషల్‌ మీడియా అకౌంట్లు, వీడియెలు పరిశీలించగా.. ఆమె రైట్‌వింగ్‌ భావజాలం గలవారని తేలినట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. గతంలో కూడా అనేకమార్లు ఆమె ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంది.

అదే విధంగా గతంలోనూ స్టెల్లా చేసిన విచిత్ర వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ఆత్మలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం వల్లే.. గర్భస్రావం జరుగుతుందని, జననేంద్రియాలలో సమస్యలు తలెత్తి ఒత్తిడి లోనవుతారని ఆమె చెప్పిన మాటలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాకుండా ఏలియన్ల డీఎన్‌ఏతో అనారోగ్యం బారిన పడినవారికి చికిత్స చేయడం వల్ల మానవ జాతి, రాక్షస జాతి కలిసిపోయిందని, అదే విధంగా స్వలింగ సంపర్క వివాహాలు పెద్దలు- పిల్లల మధ్య పెళ్లికి దారి తీస్తాయంటూ తలాతోకా లేకుండా మాట్లాడిన తీరును పలువురు విమర్శిస్తున్నారు. వైద్యురాలి‌గా బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న స్టెల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు.