రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ (44) ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నావల్నీ గత మూడు వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో ఆరోగ్య పరిస్థితి వేగంతో క్షీణిస్తోందని ఆయన వ్యక్తిగత వైద్యులు యరోస్లావ్‌ అషిఖ్మిన్ వెల్లడించారు.

ఆయన క్షణంలోనైనా తుదిశ్వాస విడిచేప్రమాదముందన్నారు. కుటుంబసభ్యులు అందజేసిన పరీక్షల రిపోర్టులు పరిశీలిస్తే రక్తంలో పొటాషియం, క్రియాటినిన్ స్థాయిలుపెరిగిపోయాయనీ, ఇది గుండెపోటుకు, కిడ్నీల వైఫల్యానికి దారి తీస్తుంది  అన్నారు.

కాగా, నావల్నీ మీద విష ప్రయోగం అనంతరం జర్మనీలో నాలుగు నెలల పాటు చికిత్స పొంది.. ఆ తరువాత జనవరిలో స్వదేశం చేరుకున్న నావల్నీని అధికారులు అరెస్టు చేశారు.

నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలపై ఆయన కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే వెన్ను నొప్పితో బాధపడుతున్నానని, కాళ్లలో స్పర్శ కోల్పోయానని వ్యక్తిగత వైద్యుడుని అనుమతించాలంటూ నావల్నీ చేసిన వినతిని జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు.