Asianet News TeluguAsianet News Telugu

‘అమెరికాపై అల్ ఖైదా మరోసారి దాడి చేయవచ్చు.. అఫ్ఘాన్‌లో బలపడానికి ప్రయత్నాలు చేస్తున్నది’

అమెరికాకు అల్ ఖైదా నుంచి ముప్పు సమసిపోలేదని, మరో ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో అది బలపడి మళ్లీ దాడి చేయవచ్చునని ఆ దేశ నిఘా అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లో దాని కార్యకలాపాలను చూస్తున్నట్టు వివరించారు.

al qaeda may attack US again in one or two years says intelligence officials
Author
Washington D.C., First Published Sep 15, 2021, 8:15 PM IST

వాషింగ్టన్: అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై అల్ ఖైదా దాడి చేసి ఈ నెల 11వ తేదీకి 20ఏళ్లు నిండాయి. అమెరికా నడిబొడ్డున జరిగిన ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉన్నది. దీనికి ప్రతీకారంగానే అమెరికా, నాటో సేనలు ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై కాలుమోపాయి. అల్ ఖైదాను నిర్మూలించడమే లక్ష్యంగా అక్కడి వెళ్లాయి. సుమారు 20ఏళ్లపాటు అక్కడే ఉన్నాయి. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఛేదించామని ప్రకటించుకున్న అమెరికా ఇటీవలే కాబూల్ నుంచి బలగాలను ఉపసంహరించుకుంది. కానీ, నిఘా వర్గాలు మాత్రం మరో ప్రమాదకర అంచనాను వేస్తున్నాయి. అమెరికాకు అల్ ఖైదా నుంచి ముప్పు ముగియలేదని చెబుతున్నాయి. మరో ఒకట్రెండు సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో అల్ ఖైదా బలపడవచ్చని, ఇదే కాలంలో అమెరికాపై మరోసారి దాడికి తెగబడే ముప్పు ఉన్నదని హెచ్చరిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఇద్దరు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులే తెలిపారు.

ఇంటెలిజెన్స్, నేషనల్ సెక్యూరిటీ అలయెన్స్, మరో ఎన్‌జీవో సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో నిఘా అధికారులు మాట్లాడారు. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్ మాట్లాడుతూ, అల్ ఖైదా తిరిగి బలపడానికి మరో ఒకటి లేదా రెండు సంవత్సరాలు పట్టవచ్చునని వివరించారు. తర్వాత అమెరికాపై దాడి చేసేంతగా ఇంతలో బలపడవచ్చని అంచనాలున్నట్టు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తిరిగి తమ వనరులను సమకూర్చుకుని ఈ విషయంపై స్పష్టత తెచ్చుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. 

సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ కొహెన్ కూడా ఈ వాదనను అంగీకరించారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లో అల్ ఖైదా కార్యకలాపాలను చూస్తున్నామని చెప్పారు. పైన చెప్పిన సమయంలో ఆ ఉగ్రవాద శిబిరం బలపడవచ్చని తెలిపారు. నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హెయిన్స్ మాత్రం అల్ ఖైదా తమ ప్రాధాన్యత జాబితాలో సవరించి ప్రాధాన్యతను తగ్గించినట్టు తెలిపారు. ఇప్పుడు యెమెన్, సోమాలియా, సిరియా, ఇరాక్‌ల నుంచే ఎక్కువ ముప్పు ఉండే అవకాశమున్నట్టు భావిస్తున్నట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios