కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో.. ప్రతి ఒక్కరూ  కోవిడ్ రూల్స్ పాటించాలని ప్రభుత్వాలు నెత్తీనోరు మొత్తుకొని చెబుతున్నాయి. కాగా.. ఈ మహమ్మారి కారణంగా.. మొన్నటి వరకు విమాన సర్వీసులు కూడా మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే... విమానాల్లో సైతం కోవిడ్ రూల్స్ పాటించేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ రూల్స్ పాటించని క్రమంలో.. ఎంతటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడటం లేదు. తాజాగా.. ఓ విమానంలో రెండేళ్ల ఓ పసివాడు మాస్క్ పెట్టుకోనంటూ మారాం చేయడంతో విమాన సిబ్బంది ఉన్నపాటున ప్రయాణికులందర్నీ కిందికి దించేశారు. 

పోర్ట్స్‌మౌత్‌కి చెందిన రేచల్ స్టార్ డేవిస్ అనే మహిళ నార్త్ కరోలినాలోని షార్లోట్ నుంచి మాంచెస్టర్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆమె తన ఆవేదన షేర్ చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానంలో తన తల్లి, రెండేళ్ల కుమారుడితో తాను ప్రయాణించాననీ.. నిబంధనల పేరుతో విమాన సిబ్బంది వ్యవహరించిన తీరు తనను బాధించిందని ఆమె పేర్కొన్నారు. 

‘‘విమానం ఎక్కిన తర్వాత నా కుమారుడు మాస్క్ పెట్టుకోనంటూ అరిచి గీ పెట్టాడు. ఎంతచెప్పినా వినకుండా ఏడుస్తూ తనకు పెట్టిన మాస్క్ తీసేస్తున్నాడు. అదే సమయంలో ఓ ఫ్లై్ట్ అటెండెంట్ మా దగ్గరికి పరుగున వచ్చింది. రెండేళ్ల పైబడిన పిల్లలంతా మాస్క్ ధరించాలన్నది తమ ఎయిర్‌లైన్స్ నిబంధన అని పేర్కొంది. మరోవైపు విమాన సిబ్బంది ప్రయాణికులందర్నీ వెంటనే కిందికి దిగాలని చెప్పారు. మేము కూడా దిగేశాం. మేము వెనుక సీట్లలోకి వెళ్లి కూర్చున్నాక గానీ మళ్లీ విమానం కదిలింది..’’ అని ఆమె పేర్కొంది. 

ఆమె పోస్టుకు ఇప్పటికే దాదాపు రెండు లక్షల మంది లైక్ కొట్టారు. విమాన సిబ్బంది వారి పని వారు సక్రమంగా నిర్వహించారని కొందరు నెటిజన్లు చెబుతుండగా... చంటిబిడ్డతో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల సంయమనం పాటించాల్సిందని మరికొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే సదరు మహిళ కుటుంబాన్ని సంప్రదించి వారు ఎదుర్కొన్న ఇబ్బందిపై ఆరా తీసినట్టు అమెరికన్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రయాణికుల క్షేమం కోసమే తాము ఫేస్ మాస్క్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది.