Iran Israel War : ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం... ఇక విమానాన్నీ ఆ రూట్ లోనే...
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏ క్షణమైన యుద్దం ప్రారంభంకావచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా ఎయిర్ ఇండియాను అప్రమత్తం చేసింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్దవాతావరణంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత పౌరులను ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలను వెళ్లవద్దంటూ భారత్ హెచ్చరికలు జారీచేసింది. ఇప్పటికే ఇరుదేశాల్లో వున్న భారతీయులు జాగ్రత్తగా వుండాలని ఆయా దేశాల్లోని భారత ఎంబసీలు హెచ్చరించాయి. తాజాగా ఆయా దేశాల్లో పరిస్థితి మరింత దిగజారడంలో భారత విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు ఇప్పటికే విమానసేవలు నిలిపివేసిన ఏయిర్ ఇండియా ఇప్పుడు ఆ దేశాల గగనతలంలో కూడా ప్రయాణించడం లేదు. భారత్-లండన్ మధ్య నడిచే ఓ విమానాన్ని ఇరాన్ గగనతలంపైనుండి కాకుండా మరో మార్గంలో తీసుకువెళ్లినట్లు సమాచారం. కాస్త దూరమైనా, నిర్ణీత సమయం కంటే కాస్త ఆలస్యమైనా ఇరాన్, ఇజ్రాయెల్ గగనతలంలోకి భారత విమానాలు ప్రవేశించడంలేదు.
యూరప్ దేశాలను వెళ్లే విమానాలన్ని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్దవాతావరణం నేపథ్యంలో దారి మళ్లినట్లు... దీంతో దూరం పెరిగి రెండు గంటలు ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. దీంతో ప్రయాణ ఖర్చు కూడా పెరుగుతోందట. అయినప్పటికి ప్రయాణికులు భద్రతను దృష్టిలో వుంచుకుని భారత విమానయాన సంస్థలు పశ్చిమాసియా దేశాలమీదుగా విమానాలను నడపడం లేదు.
ఈ నెల ప్రారంభంలో సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడిచేసింది. అప్పటినుండి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా ఏ క్షణమైనా ఇజ్రయెల్ పై ఇరాన్ క్షిపణులతో దాడి చేయవచ్చని అమెరికా హెచ్చరికల నేపథ్యంలో మరింత ఉద్రిక్తత ఏర్పడింది. ఇజ్రాయెల్ లోని టెల్ ఆవీన్ పై దాడికి ఇరాన్ క్షిపణులు సిద్దంగా వున్నాయని... ఎప్పుడైనా దాడి జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు.