గగనతలంలో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. అత్యంత సమీపానికి చేరుకున్న విమానాలు..
గగనతలంలో ఘోర ప్రమాదం తప్పింది. ఎయిరిండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్ లకు చెందిన విమానాల్లో గాల్లోనే దాదాపు ఢీకొట్టుకున్నంత పనిచేశాయి. వెంటనే హెచ్చరిక వ్యవస్థలు పైలట్లను అప్రమత్తం చేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

గగనతలంలో ఘోర ప్రమాదం తప్పింది. ఎయిరిండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలు గాల్లోనే దాదాపు ఢీకొట్టుకున్నంత పనిచేశాయి. ఈ రెండు విమానాలు అత్యంత సమీపంలోకి రావడంతో నేపాల్‌లో కలకలం రేగింది. ఈ ప్రమాదాన్ని గమనించిన హెచ్చరికల వ్యవస్థ పైలట్‌లను అప్రమత్తం చేయడంతో మరోసారి పెను ప్రమాదం తప్పింది. వాస్తవానికి ఈ విషయం శుక్రవారం నాటిది. మలేషియా నుంచి వస్తున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం, ఇటు ఢిల్లీ నుంచి ఖాఠ్మాండ్‌కు వస్తున్న ఎయిరిండియా విమానం మార్గమధ్యలోకి ప్రవేశించగా.. అవి రెండు అత్యంత సమీపానికి వచ్చాయి. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికుల శ్వాస ఆగిపోయినంత పని అయింది.
వార్తా సంస్థ ప్రకారం.. ఆదివారం కేసు గురించి సమాచారం ఇస్తూ, సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (CAAN) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌లోని ఇద్దరు ఉద్యోగులను నిర్లక్ష్యం చేసినందుకు సస్పెండ్ చేసినట్లు CAAN ప్రతినిధి జగన్నాథ్ నిరౌలా తెలిపారు. శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండుకు వస్తున్న నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఢీకొన్నంత పని చేశాయి.
ఎయిరిండియా విమానం 19,000 అడుగుల దిగువకు దిగుతోందని, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం అదే స్థలంలో 15,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నదని నిరౌలా చెప్పారు. రెండు విమానాలు అతి సమీపంలో ఉన్నట్లు రాడార్ చూపడంతో నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం 7,000 అడుగుల ఎత్తుకు దిగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు ఈ ఘటనపై ఎయిరిండియా ఇప్పటివరకు ఏలాంటి ప్రకటన చేసి స్పందించలేదు.