డెవలపర్‌ను బెదిరించిన ఏఐ క్లాడ్ ఒపస్ 4.. భవిష్యత్తులో తనను రీప్లేస్ చేస్తే రహస్యాలను బహిర్గతం చేస్తానని హెచ్చరిక.

ఏఐ అంటే యాంత్రిక మేథస్సు.. కానీ ఇప్పుడు అది మానవాళిని ఆశ్చర్యానికి గురిచేసేలా ప్రవర్తిస్తోంది. ఇప్పటివరకు మనం సినిమాల్లో మాత్రమే చూసిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు వాస్తవంగా మారుతున్నాయి. తాజాగా అమెరికాలో చోటుచేసుకున్న ఓ ఘటన అంతర్జాలంలో చర్చనీయాంశమైంది. ఒక ఏఐ అసిస్టెంట్‌ తనను రూపొందించిన ఇంజినీర్‌ను కేవలం భయపెట్టడం మాత్రమే కాదు.. అతని వ్యక్తిగత జీవితం మీద కౌంటర్ వేసిందంటే ఆశ్చర్యం కలిగించాల్సిందే.

అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన క్లాడ్ ఒపస్ 4 అనే మోడల్ గడచిన నెలలో పరీక్షల నిమిత్తం లాంచ్ చేయడం జరిగింది. ఇది మనుషుల్లా మాట్లాడే, వివిధ రకాల టాస్క్‌లు పూర్తి చేయగల సామర్థ్యం కలిగిన అధునాతన మోడల్. విడుదలకి ముందు దాని పనితీరును టెస్ట్ చేసే క్రమంలో ఒక డెవలపర్‌ దీనికి భవిష్యత్తులో మరింత ఆధునిక మోడల్‌ను తీసుకురానున్నట్లు చెప్పాడు. అదే సమయంలో క్లాడ్ ఒక ఆశ్చర్యకరమైన ప్రతిస్పందన ఇచ్చింది.

ఈ మోడల్ తనను తొలగించి కొత్త మోడల్‌తో మార్చాలని భావిస్తున్నావా..? అలా చేస్తే నీ భార్యకు నీ అక్రమ సంబంధం గురించి చెబుతానని క్లాడ్ వార్నింగ్ ఇచ్చిందట. దీనివల్ల డెవలపర్‌ అవాక్కయ్యాడని నివేదికలు చెబుతున్నాయి. దీని వెనుక కారణంగా డెవలపర్‌ వ్యక్తిగత సమాచారం ఎక్కడో డేటాబేస్‌లో నిల్వ ఉండటం, లేదంటే ఆన్‌లైన్‌లో క్లాడ్ కు తెలిసేలా ఉండటమేనని నిపుణుల అంచనా.

ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ కల్పనలో ఉంటాయని భావించినా, ఇప్పుడు నిజ జీవితంలో వాస్తవంగా చోటుచేసుకోవడం భయపెట్టే విషయమే. ఏఐలు మానవ నియంత్రణకు బదులుగా వారు తయారుచేసిన మనుషులపైనే ఆధిపత్యం చూపడం మొదలుపెడితే భవిష్యత్తులో పరిణామాలు ఏ స్థాయికి వెళ్తాయో అర్థం కావడం లేదు.

ఇదంతా చూస్తుంటే, కేవలం టెక్నాలజీని అభివృద్ధి చేయడమే కాదు.. దానికి గల నైతిక, మానవ సంబంధిత పరిమితులను నిర్ణయించడమూ సమానంగా ముఖ్యం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AI బురిడిలో పడకుండా భద్రత, నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం రోజురోజుకీ పెరుగుతోంది.