సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు ఇస్రో.. ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని శనివారం ఉదయం 11.50 గంటలకు చేపట్టనుంది. అయితే ఈ క్రమంలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మాజీ  కమాండర్ క్రిస్ హాడ్‌ఫీల్డ్.. భారతదేశం సాంకేతిక పరాక్రమాన్ని ప్రశంసించారు.

చంద్రయాన్‌-3 ప్రయోగ విజయవంతమైన తర్వాత జోష్‌లో ఉన్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్దమైంది. సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు ఇస్రో.. ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని శనివారం ఉదయం 11.50 గంటలకు చేపట్టనుంది. అయితే ఈ క్రమంలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) మాజీ కమాండర్ క్రిస్ హాడ్‌ఫీల్డ్.. భారతదేశం సాంకేతిక పరాక్రమాన్ని ప్రశంసించారు. ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాడ్‌ఫీల్డ్.. భారతదేశ అంతరిక్ష విజయాల పట్ల తన ప్రశంసలను వ్యక్తం చేశాడు. ఆదిత్య L-1 మిషన్‌కు సంబంధించి ప్రపంచ ప్రాముఖ్యతను హైలైట్ చేశాడు.

ఆదిత్య ఎల్-1 ఉపగ్రాహాన్ని PSLV-C57 ద్వారా అంతరిక్షంలోకి తీసుకువెళ్లనుంది. ఈ మిషన్ సూర్యుడిని వివరంగా అధ్యయనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఏడు వేర్వేరు పేలోడ్‌లు ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫోటోస్పియర్‌, క్రోమోస్పియర్‌, సూర్యుడి బయటి పొర (కరోనా)పై అధ్యయనం చేయనున్నాయి. తద్వారా సౌర తుఫానులు, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.

ఈ నేపథ్యంలో ఆదిత్య ఎల్-1 సుదూర ప్రభావాన్ని హాడ్‌ఫీల్డ్ నొక్కిచెప్పారు. ‘‘మనం ఆదిత్య ఎల్-1ను మనకు, సూర్యునికి మధ్య ఉంచినప్పుడు ఆ విషయాలను గ్రహించడానికి.. సూర్యుడు ఎలా పనిచేస్తాడో బాగా అర్థం చేసుకోవడానికి, దాని నుంచి భూమికి కలిగే ముప్పులను గుర్తించేందుకు వీలు కలుగుతుంది. మనుషులుగా మనల్ని రక్షించడంలో ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ.. వాస్తవానికి మన ఎలక్ట్రికల్ గ్రిడ్, మన ఇంటర్నెట్ గ్రిడ్, మనం దానిపై ఆధారపడే వేలాది ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి’’ అని కూడా హాడ్‌ఫీల్డ్ పేర్కొన్నారు. 

ఆదిత్య ఎల్-1 భూమి నుంచి సూర్యుని దిశలో 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజియన్ పాయింట్ 1 (ఎల్-1) చుట్టూ తిరుగుతుంది. సుమారు నాలుగు నెలలు ప్రయాణించి ఆ గమ్యాన్ని చేరుకోనుంది. అయితే హాడ్‌ఫీల్డ్.. మన దైనందిన జీవితంలో, విద్యుత్ నుంచి కమ్యూనికేషన్ వరకు సాంకేతికత కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఆదిత్య-L1 నుంచి అంతరిక్ష వాతావరణ డేటాను ప్రపంచానికి అమూల్యమైనదిగా పేర్కొన్నారు. 

అలాగే అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన ఇటీవలి విజయాలను హాడ్‌ఫీల్డ్ ప్రశంసించారు. ముఖ్యంగా చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ చేయబడిందని.. ఇది భారతదేశ సాంకేతిక నైపుణ్యాన్ని చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. చంద్రుని అన్వేషణలో భారతదేశం తక్కువ ఖర్చుతో కూడిన విధానం ప్రపంచ అంతరిక్ష పరిశ్రమలో దాని పోటీతత్వానికి నిదర్శనమని అన్నారు. 

చంద్రయాన్-3 కోసం భారతదేశం యొక్క బడ్జెట్ కేటాయింపుల గురించి మాట్లాడుతూ.. ఇది దేశం యొక్క మొత్తం బడ్జెట్‌లో ఒక చిన్న భాగాన్ని సూచిస్తుందని హాడ్‌ఫీల్డ్ అన్నారు. ఈ మిషన్ భారతీయ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన సామర్థ్యానికి బలమైన ప్రదర్శన అని పేర్కొన్నారు. 

భారతదేశం అంతరిక్ష కార్యక్రమాలను నడపడం, సాంకేతికత అభివృద్ధికి ముందుకు రావడం, భారతీయ వ్యాపారాలు, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రైవేటీకరణను సులభతరం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని హాడ్‌ఫీల్డ్ ప్రశంసించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కొన్నేళ్లుగా దీనిని చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఆయన భారతీయ అంతరిక్ష, పరిశోధనా సంస్థతో చాలా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం భారతదేశ నాయకత్వం భాగస్వామ్యానికి ఇది చాలా తెలివైన చర్య, దానిని ముందుకు తీసుకురావడం, దానిని అభివృద్ధి చేయడం, ప్రైవేటీకరించే ప్రక్రియ కూడా ఉంది. తద్వారా భారతదేశంలోని వ్యాపారాలు, ప్రజలు దాని నుంచి ప్రయోజనం పొందుతారు’’ అని హాడ్‌ఫీల్డ్ పేర్కొన్నారు.