ఇస్లామాబాద్: పాకిస్తాన్, భారత్ మధ్య నడిచే రెండు రైళ్లను రద్దు చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఢిల్లీ - లాహోర్ - ఢిల్లీ మధ్య నడిచే దోస్తీ బస్సు సర్వీసును రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి భారత్ 370 ఆర్టికల్ ను రద్దు చేసిన నేపథ్యంలో దిక్కు తోచని పాకిస్తాన్ తాజాగా బస్సు సర్వీసును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

దోస్తీ బస్సు సర్వీసు 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో 2001 తర్వాత అది ఆగిపోయింది. తిరిగి 2003 జులైలో ప్రారంభమైంది.  పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్ సీ) నిర్ణయం మేరకు బస్సు సర్వీసును నిలిపేసినట్లు కమ్యూనికేషన్లు, పోస్టల్ సర్వీసుల మంత్రి మురాద్ సయీద్ తెలిపారు. 

లాహోర్ - ఢిల్లీ మధ్య నడిచే దోస్తీ బస్సు ఢిల్లీ గేట్ సమీపంలోని అంబేడ్కర్ స్టేడియం టెర్మినల్ నుంచి ప్రారంభమవుతుంది. రాజస్థాన్ సరిహద్దుల మీదుగా ఇరు దేశాల మధ్య నడిచే థార్ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపేసినట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ శుక్రవారం తెలిపారు. 

భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను తెంచుకునే ఏకపక్ష నిర్ణయంలో భాగంగా పాకిస్తాన్ సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును నిలిపేసిన విషయం తెలిసిందే. థార్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం భారతదేశంలోని జోథ్ పూర్ భగత్ కీ కోఠీ స్టేషన్ నుంచి బయలుదేరి కరాచీ వెళ్తుంది. శుక్రవారంనాడు చివరిసారి ఈ థార్ ఎక్స్ ప్రెస్ పాకిస్తాన్ బయలుదేరి వెళ్లింది.