న్యూడిల్లీ: అప్ఘనిస్తాన్ తాలిబన్ హెడ్ ముల్లా అక్తర్ మన్సూర్ 2016లో పాకిస్థాన్ డ్రోన్ దాడుల్లో మరణించిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా పాకిస్థాన్-ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా డ్రోన్ దాడులు జరిపగా అందులో మన్సూర్ చనిపోయాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. 

మరణానికి ముందు పాకిస్థాన్ లో తలదాచుకున్న సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లు బయటపడింది. నకిలీ పత్రాలతో రూ. 3 లక్షలు పెట్టి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రాణాలకు తెగించి తాలిబన్ గా మారినా తన కుటుంబం కోసం ఇలా లైఫ్ ఇన్సూరెన్స్ చేయించివుంటాడని... అయితే నకిలీ పత్రాలతో చేయించుకున్నాడు కాబట్టి ఇది చెల్లదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సామాన్యులు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం సహజమే. ఇందులో వింతేమీ లేకపోయినా తాలిబన్ హెడ్‌గా ఉన్న వ్యక్తి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.